Saturday, November 23, 2024

స్వరాంధ్రప్రదేశ్ కాస్తా.. కరోనాంధ్రప్రదేశ్ గా మారింది: అయ్యన్న

స్వరాంధ్రప్రదేశ్ గా ఉన్నరాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కరోనాంధ్రప్రదేశ్ గా మార్చాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు  ఆరోపించారు. సీఎం వైఫల్యం, చేతగానితనం వల్లే వేలాది మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు. కరోనా కేసులపెరుగుదలలో రెండోస్థానం, అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో 6వ స్థానంలో ఉందన్నారు. బ్లాక్ ఫంగస్ కేసుల్లో రెండోస్థానంలో ఉందని, ఆక్సిజన్ అందకే 106మంది చనిపోవడం ప్రభుత్వ వైఫల్యంకాదా? అని ప్రశ్నించారు. ఆక్సిజన్ ఉత్పత్తిలో పొరుగురాష్ట్రాలను చూసి కూడా ఈ ముఖ్యమంత్రి నేర్చుకోవడంలేదన్నారు. రుయా ఆసుపత్రిలో 31మంది చనిపోతే తక్కువచేసి చూపారని మండిపడ్డారు. విజయవాడ రమేశ్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కేసులు పెట్టిన వారు, రుయా ఘటనలో ఎవరిపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ కు సంబంధించిన గ్లోబర్ టెండర్లు పిలవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లకు రూ.1600కోట్లు ఖర్చుపెట్టలేనివారు, ప్రకటనలకు, ప్రచారపిచ్చికి వేలకోట్లు దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తొలిడోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి రెండో డోసు వేయలేని దుస్థితి ప్రభుత్వానిదన్నారు. గుజరాత్ కోటి 56 లక్షల మందికి, మహారాష్ట్ర  2కోట్ల 9 లక్షల మందికి, కర్ణాటకలో కోటి 22 లక్షలమందికి వ్యాక్సిన్లు వేశారని తెలిపారు. ఏపీలో మాత్రం 79 లక్షలమందికే వ్యాక్సిన్లు ఇచ్చారన్నారు. బడ్జెట్లో కరోనా కట్టడికి రూ.500, వ్యాక్సిన్లకు రూ.500కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. కేరళ రాష్ట్రం బడ్జెట్లో కరోనాకి రూ.25 వేల కోట్లు కేటాయిచిందని తెలిపారు.  కరోనా కిట్లు, మందులు, ఇంజక్షన్లలో వైసీపీనేతల దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని అయ్యన్న ఆరోపించారు. ఆఖరికి శ్మశానాల దగ్గర కూడా శవాలను కాల్చే వ్యాపారం ప్రారంభించారని మండిపడ్డారు. వైద్యులు, నర్సులు, పారిశుధ్యసిబ్బందికి జీతాలివ్వలేని దుస్థితి ఈప్రభుత్వానిదన్నారు. ఆదాయం కోసమే ముఖ్యమంత్రి లాక్ డౌన్ పెట్టలేదన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రికి వెళితే, అక్కడ లోనికి కూడా రానివ్వడంలేదని, ఆ సంగతి ముఖ్యమంత్రికి తెలియదా? అని నిలదీశారు.

తుగ్లక్ ముఖ్యమంత్రి పనితీరుతో ప్రాణాలు పోవడం చూడలేక కొందరు స్వచ్ఛందంగా సేవచేస్తున్నారన్నారు. హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్, మరికొందరు వ్యక్తులు, రోగులకు సేవలందించడం, అనాథశవాలను దహనం చేయడం చేస్తున్నారని తెలిపారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక పేదలను ఆదుకోవడానికి నిత్యావసరాలు, ఆర్థికసాయం చేస్తున్నాయని తెలిపారు. ఏపీలో మాత్రం కృత్రిమ బ్లాక్ మార్కెట్ సృష్టించి వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తాను అర్థం చేసుకోడు.. ఎవరైనా చెప్పినా ఈ ముఖ్యమంత్రి వినడని మండిపడ్డారు. వైద్యులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల సలహాలు తీసుకోకుండా ముగ్గురుమూర్ఖులైన సజ్జల, ఏ2,  ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ఈముఖ్యమంత్రి ఇతరరాష్ట్రాలనుచూసి సిగ్గుతెచ్చుకుంటే మంచిదన్నారు. రెండేళ్ల నుంచి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాకుండా ఈ ముఖ్యమంత్రి ఏం పీకుతున్నాడు? అని వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయినవర్గాలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. కరోనాతో అనాథలైన పిల్లలకు రూ.10లక్షలివ్వడంకాదు, వారు పెద్దయ్యే వరకు ప్రభుత్వమే పోషించి, ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. నా ఇష్టం – నా రాజ్యం అంటూ మూర్ఖత్వంగా ప్రవర్తించకుండా, ముఖ్యమంత్రి ప్రజల గురించి ఆలోచించాలని అయ్యన్న హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement