నరేగా పనులు చేసిన ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు Y.V.B. రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అండగా ఉంటుందన్నారు. అవసరమైతే మళ్లీ ఉద్యమాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
నరేగాతోపాటు నీరు, చెట్టు పనులు చేసిన సర్పంచ్ లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు బిల్లులు ఇవ్వకపోతే సంబంధిత పంచాయతీ కార్యదర్శి కి, ఎంపీడీఓ కు, డిపిఓ కు, జిల్లా కలెక్టర్ కు, పంచాయతీ రాజ్ రాష్ట్ర కార్యదర్శికి, కమిషనర్లకు హై కోర్టు ఆదేశాలను మెన్షన్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించాలని రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. తదుపరి ఆ కాపీలను, పనుల వివరాలను తమకు పంపించాలని కోరారు. కోర్టు దీక్కార కేసు కింద హై కోర్టులో కేసు వేస్తామన్నారు. రాష్ట్ర హై కోర్టు ఎన్ని సార్లు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.
గ్రామాలను అభివృద్ధి చేసిన పాపానికి మా సర్పంచ్ లు , ఎంపీటీసీలు, జడ్పీటీసీల పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యడం దారుణం అని అన్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వలనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రజా ప్రతినిధులు, గుత్తేదారులు ముందుకు రావడంలేదన్నారు. పనులు చేస్తే బిల్లులు రావనే భయంతో గుత్తేదారులు టెండర్లకు రావడం లేదన్నారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు గుంటల మయం, అయినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి కను విప్పు కలగటం లేదన్నారు.
ఉపాధి హామీ పనులు చేసిన మా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఎంతో మంది తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమైనా కుట్టినట్లు లేదని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన వారిలో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని తెలిపారు. నిలిపేసిన బిల్లులకు 12 శాతం వడ్డీతో చెల్లించాలని, విజిలెన్స్ ఎంక్వెరీల పేరుతో బిల్లులకు కోతలు విధించవద్దని డిమాండ్ చేశారు. పూర్తి బిల్లులను 4 వారలలో చెల్లించాలని హై కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసినా..ప్రభుత్వం అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. బకాయిల కోసం కేంద్రం పంపిన ఉపాధి హామీ నిధులను కూడా పక్కదారి పట్టించి రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత అవసరాలకు వాడేసుకుందని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: నాలుగు ఓట్ల కోసం.. ఝూటా మాటలొద్దు