ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎదురుదాడి చేస్తున్నారని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యాదర్శి లోకేష్ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డిల పార్ధీవ దేహాలకు నారా లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు ఇప్పటి వరకు 27 మంది టీడీపీ నేతలను అతి దారుణంగా చంపారని లోకేష్ ఆరోపించారు. తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్థన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులపై అన్యాయంగా దొంగ కేసులు పెట్టారని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘మేము సింహం లాంటి వాళ్లం మిమ్మల్ని వదిలిపెట్టం వేటాడతాం’ హెచ్చరించారు.
కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో గురువారం తెలుగుదేశం పార్టీ నేతలు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన అన్నదమ్ములైన మాజీ సర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిని కొందరు ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా వేట కొడవళ్ళతో నరికి హతమార్చారు. మూడు రోజుల క్రితం చనిపోయిన సమీప బంధువుకు మూడవరోజు క్రతువు నిర్వహించడం కోసం స్మశానానికి వెళ్లి వస్తున్న క్రమంలో కాపు కాచి మరీ ప్రత్యర్థులు హతమార్చారు. మొదట బొలెరో వాహనాలతో ఢీకొట్టి, ఆ తర్వాత వేట కొడవలితో నరికి చంపేశారు. ఈ హత్యలకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. ఈ దారుణ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైసిపి నాయకులే వీరిని హత్య చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.