గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. రమ్య నివాసానికి వెళ్లిన లోకేష్.. ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. తర్వాత కుటుంబసభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చారు. లోకేష్ వెంట స్థానిక టీడీపీ నేతలు ఉన్నారు.
కాగా, గుంటూరులోని కాకాని రోడ్డులో ఆదివారం బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని రమ్యను శశికృష్ణ యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నిందితుడు చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా అడ్డుకున్నారు. రమ్య హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, ‘దిశ’ కింద చర్యలు తీసుకొని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: గుంటూరు ఘటనపై సీఎం ఆరా.. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం