ఏపీలో వైసీపీ నేతలు తాలిబాన్ల మాదిరి పని చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. పోలీసుల చేత తప్పుడు పనులు చేయిస్తున్నారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయించలేదని గుర్తు చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపైనే దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆనందబాబు ఆరోపించారు. ఈ చట్టాన్ని ఎత్తివేయించేందుకు ముఖ్యమంత్రి జగన్ కుట్ర పన్నారని… అందుకే ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. హత్యకు గురైనవారి కుటుంబాలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వచ్చిన సమయంలో వైసీపీ నేతలను కూడా పోలీసులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.
అధికార పార్టీ నేతల వద్ద మార్కులు సంపాదించేందుకు పోలీసులు పిచ్చిపిచ్చి కేసులు పెడుతున్నారని ఆనందబాబు మండిపడ్డారు. గుంటూరు జిల్లా పోలీసు అధికారులు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. జిల్లా పేకాట, గుట్కా, మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి పోలీసు వచ్చి పేకాట శిబిరాలపై దాడులు చేయడం జిల్లా పోలీసు అధికారులకు సిగ్గు చేటని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని, ఈ పోలీసులను ఏ సజ్జల వచ్చి కాపాడతాడో చూస్తామని నక్కా ఆనంద బాబు హెచ్చరించారు.
ఇది కూడా చదవండిః సామాన్యుడిపై బండ.. వంట గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు