నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. అన్ని స్థానాల్లో గెలుపొంది ఎన్నికలను క్లీన్‌స్వీప్ చేసింది. నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కార్పొరేషన్‌లోని 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 46 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం 54 డివిజన్లను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.
ఒక్క చోట కూడా టీడీపీ అభ్యర్థి గెలువలేదు. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురైయ్యాయి. నెల్లూరులోని 49, 50 డివిజన్లకు టీడీపీ తరుపున ఇంచార్జీగా వ్యవహరించిన కప్పిర శ్రీనివాస్ అరమీసం, అరగుండుతో దర్శనమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో 49,50 డివిజన్లలో టీడీపీ గెలువపోతే అరగుండు, అరమీసం తీయించుకుంటానని వాగ్దానం చేశారు. ఈ మాటకు కట్టుబడి ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కప్పిర శ్రీనివాస్ మాట్లాడుతూ.. 49,59 డివిజన్లలో గెలిచేందుకు వైసీపీ రూ.3 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చేంతవరకు అరగుండు, అరమీసం ఉంటానని తెలిపారు. జగన్ పోవాలి, బాబు రావాలని చెప్పారు.