టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూశారు. ఈ రోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొన్నేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
సాంబశివరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ‘తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావుగారి మరణం విచారకరం. ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన సాంబశివరావు గారు దెందులూరు నుంచి నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా పనిచేసి తనదైన ముద్రవేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు గారి మృతి బాధాకరం. ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి చిరస్మరణీయులుగా నిలిచారు. సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.