రాష్ట్రంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నేడు తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రాత్రికి బాపట్లలోనే బస చేస్తారు. పర్యటనకు వెళ్తూ దారిలో దేవేంద్రపాడు వద్ద నిరసన చేస్తున్న రైతులను చూసి ఆగి వారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా రైతులు ఆయనతో తమ ఆవేదనను పంచుకున్నారు. పంట నష్టం అంచనాకు ప్రభుత్వం ఇంతవరకు రాలేదని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల కష్టాలు మరో మూడు నెలల్లో తొలగిపోతాయని హామీ ఇచ్చారు. తాను పర్యటిస్తున్నానని జగన్ హడావుడిగా బయల్దేరారని విమర్శించారు. పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడని నిలదీశారు. పంటబీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.