Friday, November 22, 2024

మాన్సాస్ ట్రస్టును భ్రష్టు పట్టించారు: అశోక్‌ గజపతిరాజు

మాన్సాస్ ట్రస్టును భ్రష్టు పట్టించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్మన్​గా సంచయిత నియామకం చెల్లదని, అశోక్ గజపతిరాజును పునర్నియామకంపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ రెండేళ్ల కాలంలో అరాచకాలకు పాల్పడ్డారని, తనపై కక్ష గట్టి దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని 105 ఆలయాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరిగాయో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు.

సింహాచలం గోశాలలో గోమాతలను హింసించి చంపారని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం ప్రసాదించమని ఆ పైడితల్లి అమ్మవారిని ప్రార్థించినట్టు అశోక్ గజపతిరాజు వెల్లడించారు. పైడితల్లి ఆలయం, రామతీర్థం, సింహాచలం ఆలయాలకు వచ్చే ఆదాయంలో 17 శాతం పరిపాలన, నిర్వహణ, సంరక్షణ కోసం దేవాదాయ శాఖకు వెళ్తుందన్నారు. ఇది ఏ మేరకు అమలు చేశారో పరిశీలించాల్సి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement