ఏపీలో టిక్కెట్ ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై హీరో నాని మాట్లాడటం మంచి పరిణామమని అన్నారు. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని చెప్పారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదన్న అనిత.. వైసీపీ ప్రభుత్వ విధానాలపై సినిమా వాళ్లు స్పందించలేదన్నారు.
సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న అన్యాయంపై నాని లాగా పెద్ద హీరోలు నోరు విప్పాలని ఆమె కోరారు. అన్ని రంగాలకు జగన్ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్, నిత్యావసరాల వస్తువుల ధరలను తగ్గించరు.. కానీ సినిమా టిక్కెట్ ధరలను మాత్రం తగ్గించి ప్రజలను ఉద్దరించామని ప్రభుత్వం చెప్పుకుంటోందని విమర్శించారు. హీరో నాని ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాడు కాబట్టి వారి ఇంట్లో మహిళలను ఇప్పుడు మంత్రులు టార్గెట్ చేస్తారని జోస్యం చెప్పారు. మాజీమంత్రి అశోక్ గజపతి తల్లిని తిట్టిన మంత్రులకు.. నాని కుటుంబ సభ్యులను తిట్టడం పెద్ద లెక్క కాదని అనిత అభిప్రాయపడ్డారు.
కాగా, ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించిందన్నారు. థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్ల కలెక్షన్ ఎక్కువైందన్నారు. టికెట్ ధర పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని, ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital