అమరావతి, ఆంధ్రప్రభ: ఎన్నికల్లో అత్యంత కీలకమైంది ఎన్నికల మేనిఫెస్టో. ప్రతి పార్టీ నిర్ధిష్టమైన హామీలతో ఎన్నికల కోసం ప్రజల ముందుకు వెళ్లడం, దీనికోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించే ఈ మేనిఫెస్టోను పవర్ ఫుల్‌గా రూపొందించేందుకు టీడీపీ – జనసేన పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీల మేనిఫెస్టోలు ఫలించి అధికారాన్ని కట్టబెట్టాయి.
ఇప్పుడు రాష్ట్రంలో కూడా త్వరలో ఎన్నికల గంట మోగనున్న నేపథ్యంలో టీడీపీ – జనసేనలు మరింత పవర్‌ఫుల్ హామీలతో ప్రజల ముందుకు వెళ్లే ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఇప్పటికే 11 ప్రధాన అంశాలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ రెండు పార్టీలు త్వరలో పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు కొత్త హామీలతో ప్రజలను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ప్రధానంగా రాష్ట్రంలో విద్యుత్ అంశాన్ని ప్రమాణికంగా తీసుకున్న ఈ రెండు పార్టీలు పేదలకు ఉచిత గృహ విద్యుత్ అందించాలన్న యోచనలో ఉన్నాయి. విద్యుత్ రంగంలో తనకున్న అనుభవాన్ని టీడీపీ ఒక వరంగా మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ హామీ ఇప్పటికే అమలులో ఉన్న నేపథ్యంలో గృహ వినియోగానికి దీనిని వర్తింపచేయాలని యోచిస్తోంది.
కర్ణాటక తరహాలో ఆ అస్త్రాన్ని ఏపీలో కూడా సంధించాలని టీడీపీ – జనసేన పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డ్ కలిగిన పేదలు, ముఖ్యంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ఒక వరాన్ని ప్రకటించాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ బిల్లులు మోతమోగుతున్న పరిస్థితుల్లో ఈ అస్త్రం తమ పార్టీలకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తుందోనన్న భావనలో ఆ పార్టీలు ఉన్నాయి.
ఈ ఉచిత గృహ విద్యుత్ హామీని గతంలో ప్రకటించిన పథకాల కు సంబంధించిన హామీలతో కలిపి మరోసారి మేనిఫెస్టో ద్వారా ప్రజలలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మరోసారి చర్చించిన అనంతరం చంద్రబాబు దీనిపై ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. విభజన అనంతరం రాష్ట్ర విద్యుత్ రంగం పూర్తిగా సంక్షోభంలో ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే.
అత్యధిక విద్యుత్ లోటుతో ఉన్న సమయంలో అధికార పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు విద్యుత్ రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంతో పాటు అనేక సంస్కరణలు తీసుకువచ్చి మెరుగైన ఫలితాలు సాధించారు. లోటు నుంచి మిగులు విద్యుత్ దశకు రాష్ట్రం చేరుకోవడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు విక్రయించే స్థాయికి ఎదిగింది. అయితే ఆ తర్వాత టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.
అప్పటి వరకు ఉన్న విద్యుత్ వెలుగులు కాస్త మసకబారుతూ వస్తున్న పరిస్థితి నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావడాన్ని ఇప్పటికే టీడీపీ – జనసేనలు అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై పలు సందర్భాల్లో విరుచుకుపడ్డాయి. మరోవైపు విద్యుత్ వినియోగదారులకు బిల్లుల భారం అంశాన్ని ప్రతి సభలో చంద్రబాబు ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.
ఇదే సమయంలో తాము అధికారంలోకి వచ్చాక మరోసారి విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేసి ఉన్న ఛార్జీలను కూడా తగ్గిస్తామని హామీనిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గృహ వినియోగదారులకు ఈ వరాన్ని ఇవ్వాలన్న నిర్ణయానికి టీడీపీ అధినేత వచ్చినట్లుగా సమాచారం.
రైతు రుణమాఫీ దిశగా ఆలోచన..!
కర్ణాటక, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఎంతగానో ఉపయోగపడ్డ్డ మేనిఫెస్టో హామీలను గుర్తించిన టీడీపీ, జనసేన వాటికి అదనంగా మరింత పవర్‌ఫుల్‌గా మేనిఫెస్టో ఉండేలా కార్యచరణను రూపొందిస్తున్నాయి. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా రెండు కీలక అంశాలలో ప్రజలకు, రైతులకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని యోచిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా తెలుసుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఆ వర్గానికి బాసటగా నిలవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్త్తోంది. ప్రధానంగా రైతు రుణమాఫీ హామీని ఇవ్వాలన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చాయి. ఇంకోవైపు ఉద్యాన రైతులకు ఇప్పటికే హామీని జనసేన ఇచ్చింది. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు అంశాన్ని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో టీడీపీ కూడా గతంలో మాదిరిగానే లక్ష రూపాయల రుణమాఫీతో రైతులను ఆదుకోవాలని భావిస్తుంది. ఈ హామీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చేందుకు దాదాపుగా రంగం సిద్ధమయ్యింది. అసలు రుణమాఫీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ మేరకు చేయాల్సి ఉంటుందో, అందుకు తగ్గ ఆర్థిక వనరుల సమీకరణ , తదితర అంశాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇక రైతులకు చేసే ఈ మాఫీ ఏ విధంగా ఇవ్వాలి..? తదితర అంశాలపై మేనిఫెస్టో కమిటీతో చర్చించినట్లుగా తెలుస్తోంది.
హామీలపై చంద్రబాబు, పవన్‌ల ష్యూరిటీ..
ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చే హామీలన్నీ పూర్తిస్థాయిలో నెరవేరుస్తామని టీడీపీ – జనసేనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గతంలో టీడీపీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదన్న విమర్శలు, ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ అపవాదును తొలిగించుకునేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన ఆయన బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అయితే ఆ తర్వాత జనసేనతో పొత్తు ఖరారు కావడం ఆ వెంటనే రెండు పార్టీలు కలిసి 11 అంశాలతో మినీ మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటింటి ప్రచారంలో ఉన్న టీడీపీ – జనసేనలు చంద్రబాబు సంతకంతో కూడా హామీ పత్రాన్ని ప్రజలకు అందిస్తున్నారు.
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ ఉమ్మడి హామీలన్నీ నెరవేర్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ప్రతి హామీని నెరవేర్చే బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ – జనసేన ప్రకటించనున్న పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టో రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.