Friday, September 20, 2024

AP: సీమ జిల్లాల్లో తెదేపా సరికొత్త రికార్డు

  • 40 ఏళ్లలో అత్యధిక సీట్ల లో గెలుపు
  • పొత్తు పార్టీలదీ మరో రికార్డు
    తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : రాయలసీమలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా తెలుగుదేశం సంచలన రికార్డును సృష్టించింది. ఆ పార్టీ ఏర్పాటైన గత 40 ఏళ్ల సుధీర్ఘ చరిత్రలో తొలిసారిగా స్వంతంగా 42 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా గత 70ఏళ్ళ‌ చరిత్రలో ప్రధాన పార్టీలతో పొత్తులు కుదుర్చుకున్న పార్టీలు అత్యధికంగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం కూడా ఈసారి ఎన్నికల్లో చోటుచేసుకుంది రాయలసీమలో దశాబ్దాలుగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీని 40ఏళ్ల క్రితం పుట్టిన తెలుగుదేశం పార్టీ తొలిసారిగా 1983 ఎన్నికల్లో మట్టి కరిపించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలనం సృష్టించిన ఆ ఎన్నికల సందర్భంగా రాయలసీమ పరిధిలోని 4 జిల్లాలోని 52 అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ 41 స్థానాలను గెలుచుకోగా, ఆనాటి అధికార పార్టీ కాంగ్రెస్ 8 స్థానలతో సరిపెట్టుకుంది.

తరువాత 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 37 స్థానాలు లభించగా, కాంగ్రెస్ పార్టీకి 15 స్థానాలు దక్కాయి. ఆపై 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 12 స్థానాలకు పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ 38 స్థానాల్లో గెలుపొందింది. మళ్ళీ 1994లో జరిగిన ఎన్నికల్లో రాయలసీమ పరిధిలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 42 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలకు దిగజారింది. ఇక 1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 32 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు లభించాయి.

2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 14 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 39 స్థానాలు, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 17 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 32 స్థానాలు, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 22 స్థానాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాలు దక్కాయి. చివరిసారిగా 2019 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కేవలం 3స్థానాల్లో గెలువగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 49 స్థానాల్లో విజయం సాధించారు. 2011లో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2012లో జరిగిన ఉప ఎన్నికలలోనే కాక 2014, 2019 వరుస ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకోగలిగింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలను కూల్చివేసింది.

- Advertisement -

రాయలసీమ పరిధిలోని 8 జిల్లాలకు చెందిన 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధికంగా 42 స్థానాలు గెలుచుకున్నారు. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకుని 4 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, 2 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థులు అందరూ గెలుపొందారు. మొత్తం మీద ఆ మూడు పార్టీల కూటమికి మొత్తం 55స్థానాల్లో 48 స్థానాలు లభించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలకు పరిమితమైంది.

మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ, జనసేన పార్టీలు పోటీ చేసిన 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవడం కూడా ఒక రికార్డుగానే చెప్పుకోవాలి. 1983 తరువాత జరిగిన 10ఎన్నికల్లో అటు వామపక్షాలు, ఇటు బీజేపీ ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని పోటీ చేసాయి. ఆ క్రమంలో 1985, 1994, 2004 ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులు ముగ్గురు, 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఒక్కరు మాత్రం గెలుపొందారు. 2009 ఎన్నికల్లో దాదాపుగా అన్ని స్థానాలలో పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ 3 స్థానాలను గెలుచుకోగా 2014 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసిన సమైక్యాంధ్ర పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకుని 6 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, జనసేన పార్టీలు అన్ని చోట్లా గెలుపొందడం ద్వారా రికార్డు సృష్టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement