Wednesday, November 20, 2024

TDP Internal Clash – ఎవరా చిన్ని.. కారెక్టర్ లెస్ ఫెలో…

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత కుమ్ములాట వై‌‌సీపీకి వినోదం పంచుతోంది. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓ కంచుకోటగా మారిన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో.. టీడీపీలో అంతర్గత ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ ఆధిపత్య పోరాటానికి కేశినేని నాని కుటుంబమే కీలకం కావటం విశేషం. విజయవాడ ఎంపీ టికెట్ కోసం కేశినేని బ్రదర్స్ తన్నులాట తెరమీద సంచలనం రేపింది. మరోసారి తాను బరిలో దిగుతానని సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ఘంటాపథంగా చెబుతుండగా..తనకు టీడీపీ అధిష్టానం అండదండలు ఉన్నాయని, ఇప్పటికే హామీ ఇచ్చిందని కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తిరువూరులో బుధవారం టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కుర్చీలతో దాడికి దిగాయి. ఈ ఘర్షణలో ఎస్ఐ గాయపడ్డారు. ఈ నెల 7న తిరువూరులో చంద్రబాబు సభ నేపథ్యంలో ఏర్పాట్లపై స్థానిక నేతలను సమన్వయ పర్చేందుకు కేశినేని నాని, కేశినేని చిన్ని తిరువూరు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో అసలు చిచ్చు మంటలు రేపింది. ఫ్లెక్సీలో నాని ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. కుర్చీలు విరగ్గొట్టి, ఫ్లెక్సీలు చించి తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ దత్తుపై విరుచుకుపడ్డారు.

తిరువూరు కార్యాల‌యానికి వెళ్లిన‌ నాని..
ఈ విషయం తెలిసి కేశినేని చిన్ని .. తిరువూరు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనను నాని వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పార్టీలో చిన్ని ఎవరు..? ఎంపీనా?, ఎమ్మెల్యేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయనే తాను సభలకు దూరంగా ఉంటున్నానని, యువగళం పాదయాత్రలోనూ అందుకే పాల్గొనలేదని నాని వివరించారు. తాను చంద్రబాబును పట్టించుకోవడం లేదని ప్రచారం చేస్తున్నారని.. కానీ తాను ఓపికగా పాటిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు కోసం, టీడీపీ అధికారంలోకి రావడం కోసమే ఎన్నో అవమానాలు భరిస్తున్నానని కేశినేని నాని పేర్కొన్నారు.

విజయవాడలో ఒక క్యారెక్టర్ లెస్ ఫెలో తనను చెప్పుతో కొడతానని ప్రెస్‌మీట్‌లో చెప్పాడని, పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు గొట్టంగాడు అని వ్యాఖ్యానించారని నాని గుర్తుచేశారు. టీడీపీకి దక్కాల్సిన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్‌ను అమ్ముడుపోయి చెడగొట్టారని ఆయన ఆరోపించారు. ఏడాదిగా ఈ కుంపటి రగులుతోందని, ఈ వ్యవహారానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని కేశినేని పేర్కొన్నారు. తిరువూరు ఇన్‌ఛార్జీ శ్యామ్ దత్ రాజకీయాలకు పనికిరాడని, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని ఆయన వెల్లడించారు. తిరువూరు సభ సక్సెస్ చేసే బాధ్యత తనదేనని, తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ఎంపీ నాని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement