Saturday, November 23, 2024

టిడిపి ఎంపి అభ్య‌ర్ధులుగా కొత్త నేత‌లు…చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందుకు తగినట్లుగా సన్నాహాలు చేసుకుంటూ శరవేగంగా అడుగులు వేస్తోంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న తెదేపా అధిష్టానం ఇప్పుడు ఆ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. గతానికి పూర్తి భిన్నంగా పార్టీలో మార్పులు తెస్తున్న చంద్రబాబు ఇప్పటికే ప్రక్షాళన పై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షణ్ణంగా తెలుసుకుంటున్న ఆయన మార్పులు, చేర్పులు దిశగా నిర్ణయాలు తీసుకుంటు న్నారు. ఇప్పటికే అసెంబ్లిd అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కొందరు ఇంఛార్జ్‌లకు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో వారు బిజీగా నిమగ్నమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ అధిష్టానం పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. గత వైభవాన్ని తిరిగి పొందాలని ప్రయత్నిస్తున్న ఆ పార్టీ అధిష్టానం బలమైన అభ్యర్థుల ఎంపికకు ప్రణాళికలు రచిస్తోంది. ఒకవైపు అసెంబ్లి, మరోవైపు పార్లమెంట్‌ స్థానాల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలన్న లక్ష్యంతో పదునైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఆర్థిక, సామాజిక, ఆయా నియోజకవర్గాల సమీకరణాలకు ఆధారంగా కొత్త ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. గతంలో మాదిరిగా హస్తినలో మళ్లి చక్రం తిప్పాలంటే ఎంపీ అభ్యర్థుల గెలుపు తప్పనిసరైన పరిస్థితుల్లో ప్రతి సమీకరణలను సీరియస్‌గా తీసుకుని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది.

గత ఎన్నికల్లో కేవలం ముగ్గురు అభ్యర్థులే పార్లమెంట్‌ సభ్యులుగా విజయం సాధించారు. విజయవాడ, గుంటూరుతో పాటు శ్రీకాకుళం స్థానాలను తెదేపా కై వసం చేసుకుంది. అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే టీడీపీ అధిష్టానంపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా ఉన్న కింజారపు రామ్మోహన్‌ నాయుడు ఈసారి అసెంబ్లి బరిలోకి దిగి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవిని పొందాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో నరసన్న పేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకోవడమే కాకుండా టీడీపీ అధిష్టానానికి కూడా ఇప్పటికే తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలిపారు. ఇక గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌ వివాదరహితుడుగా ఉన్నప్పటికీ పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని పరిస్థితి ఉంది. తాజా సమీకరణాల నేపథ్యంలో ఈ స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్న ఊహాగానాలు పార్టీ వర్గాల్లో ఇప్పటికే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో దాదాపు 10 నుంచి 12 పార్లమెంట్‌ స్థానాల్లో యువకులు, ఉన్నత విద్యావంతులకు టికెట్లు ఇవ్వాలన్న యోచనలో తెదేపా అధిష్టానం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్నారు.
శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న 25 పార్లమెంట్‌ స్థానాల్లో దాదాపు కొత్త, యువ అభ్యర్థులే బరిలోకి దింపే యోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. మరోవైపు పార్టీ కార్యక్రమాల నిర్వాహణలో తమదైన శైలిలో శ్రమిస్తున్న యువనేతలకు ప్రొత్సాహం అందించాలన్న భావనలో పార్టీ ఉంది. మాజీమంత్రుల తనయులు చింతకాయల విజయ్‌, పరిటాల శ్రీరామ్‌, బాలయోగి తనయుడు హరీష్‌ లాంటి యువనేతలు పార్టీ అధిష్టానం దృష్టిలో ఇప్పటికే ఉన్నారు. ఈ తరహాలో పార్టీకోసం పనిచేస్తున్న ఉన్నత విద్యావంతులను స్థానిక సమీకరణాల అంశాల ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్టానం సుదీర్ఘమైన కసరత్తును మొదలుపెట్టింది. అసెంబ్లిd అభ్యర్థులకు ఉన్న పోటీ పార్లమెంట్‌కు లేకపోవడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి పార్టీ జెండాను ఎగరవేసే దిశగా తెదేపా అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement