Saturday, November 23, 2024

రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ దారెటు.. ఇంకా నిర్ణయం ప్రకటించని చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎటువైపు మొగ్గుచూపుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడింది. జులై 18న ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమితో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల కూటమి ఇంత వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఎన్డీయే తనకున్న బలంతో అభ్యర్థిని బరిలోకి దింపుతుండగా ప్రతిపక్షాలు కాంగ్రెస్‌ సారథ్యంలో ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగురాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే అధికార వైకాపాకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బలం ఉంది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని కలిగిఉంది. తెలుగుదేశం పార్టీకి సంఖ్యాపరంగా చూస్తే పెద్దగా బలం లేకపోయినప్పటికీ ఈ ఓట్లు మాత్రం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు గడువు ఇంకా సుమారు నెల రోజులు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ ఇంతవరకు తమ మద్దతు ఎవరికో తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎటు పయనిస్తుందోనన్న ఆసక్తిని కనబరుస్తున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో పావులు కదుపుతూ ప్రతి ఎన్నికలో కీలకంగా వ్యవహరించారు. గత కొద్దికాలంగా జాతీయ రాజకీయాలపై పెద్దగా దృష్టి సారించకుండా మౌనం వహిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన నాటినుంచి జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ పాత్ర చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో తిరిగి పార్టీకి జీవం పోసేందుకు చంద్రబాబు సమగ్ర ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. మళ్లి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహరచనలు చేస్తూ రాష్ట్ర రాజకీయాలకే దాదాపు పరిమితమయ్యారు. మళ్లి పూర్వ వైభవం వచ్చాకే జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్రను పోషించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో సైతం ఈ అంశంపై ప్రశ్నలు వేసినప్పటికీ ఇంకా సమయం ఉంది. మా వైఖరేంటో చెప్పేందుకని దాటవేశారు.

.ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తూ రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లిdలో కీలక సమావేశాన్ని సైతం నిర్వహించారు. తాజాగా జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి దీదీ ఎవరికీ ఆహ్వానం పంపకపోవడం కూడా చర్చకు దారితీసింది. ఇటు అధికార వైసీ పీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మరోవైపు, ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు. గతంలో చంద్రబాబు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి దీదీతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి బీజేపీపై పోరుబాట పట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఇవన్నీ విఫలమయ్యాయి. గత అనుభవాలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దీదీ ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబును ఈ సమావేశానికి ఆహ్వానించలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతోనే టీడీపీ, అధికార వైకాపాలు ముందుకు సాగుతాయన్న యోచనలో దీదీతో పాటు మిగిలిన పక్షాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఎన్డీయేతోనే వెళ్తుందా? అన్న ఆసక్తి సర్వత్రా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement