Tuesday, November 26, 2024

AP | జోరు పెంచిన టీడీపీ..! రాష్ట్రం నలువైపులా ప్రచార పర్వం

అమరావతి, ఆంధ్రప్రభ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ జోరును పెంచింది. రాష్ట్రం నలువైపులా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అధినేత నుంచి యువనేతతో పాటు నేతలంతా జనంలో ఉండేలా ప్లాన్‌ చేసుకుని మరీ కార్యక్రమాల నిర్వాహణకు అంకురార్పరణ చేశారు. ప్రాజెక్ట్‌ల సందర్శన పేరిట చంద్రబాబు ఒకవైపు యాత్ర సాగిస్తుండగా యువగళంతో యువనేత నారా లోకేష్‌ ముందుకు సాగుతున్నారు.

ఇక భవిష్యత్‌కు గ్యారెంటీ పేరిట వ రుస కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటుంది. ఉత్తరాంధ్రలో భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్ర సాగుతుండగా వివిధ జిల్లాల్లో టీడీపీ మహిళా నేతలు మహాశక్తి కార్యక్రమంతో పర్యటనలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని నేతల పనితీరును క్షుణ్ణంగా గమనిస్తున్న అధిష్టానం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటూ ఇంఛార్జ్‌లకు సూచనలు, సలహాలు, ఆదేశాలిస్తోంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశంతో నేతలు ప్రజల్లో ఉండేలా నిర్ధిష్టమైన ప్రణాళికను రూపొందించి దాన్ని పక్కాగా అధిష్టానం అమలు చేస్తోంది.

- Advertisement -

ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు జనం నుంచి అనూహ్య స్పందన వస్తున్న తరుణంలో కేడర్‌, నేతల్లో జోష్‌ మరింత పెరిగింది. ఆ ఉత్సాహంతో నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు నారా లోకేష్‌ కూడా ప్రజాధరణతో యువగళంను సాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో ఒకవైపు సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుతూనే మరోవైపు వివిధ అంశాలను స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకు నిర్ధిష్టమైన హామీలిస్తూ ముందుకు నడుస్తున్నారు.

ఇటీవల మూడు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయం సాధించడం కూడా ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. యువత పార్టీకి అనుకూలంగా ఉన్నారని భావిస్తున్న టీడీపీ అధిష్టానం వారికి భవిష్యత్‌ హామీలను ఇస్తోంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీలను ఇచ్చింది. ప్రస్తుతం మహాశక్తి పథకాన్ని మహిళల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ అధిష్టానం మహిళా టీమ్‌లను సిద్ధం చేసి రంగంలోకి దింపింది.

ఈ మహిళా టీమ్‌లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మహిళలకు టీడీపీ ప్రకటించిన తాయిలాలపై అవగాహన కల్పిస్తున్నాయి. ఒక యాత్రకు ఇంకో యాత్రకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో కార్యక్రమాల రూపకల్పన చేసిన టీడీపీ ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి రంగాన్ని ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతగా తీసుకుని ఎన్నికల ప్రచారానికి తెరదీశారు. వ్యవసాయ రంగ సంక్షోభంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వారిలో భరోసానింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతానికి భిన్నంగా చంద్రబాబు దూకుడుగా వ్యవహరిస్తూ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఛాలెంజ్‌లు, సవాళ్లతో ఆయన పర్యటన సాగుతోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాజెక్ట్‌ల సందర్శన యాత్ర ముగియగానే ఆ వెనువెంటనే జిల్లాల పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement