Sunday, November 24, 2024

గ‌న్న‌వ‌రం, గుడివాడ‌ల‌లో గెలిచేది ఎలా….

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం ఒక ఎత్తు అయితే గన్నవరం, గుడివాడ నియోజక వర్గాల్లో చేస్తున్న పోరాటం మరో ఎత్తుగా మారింది. టీడీపీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కొడాలి నాని, వంశీలు ప్రస్తుతం వైకాపాలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లోనూ కొడాలి నాని వైసీపీ నుండి పోటీచేసి గుడివాడ నుండి గెలుపొందగా అదే ఎన్నికల్లో వంశీ గన్నవరం నుండి టీడీపీ అభ్యర్ధిగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఆతరువాత పరిణామాల్లో వంశీ టీడీపీని వీడి వైకాపాకు అనుబంధంగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ ఇద్దరి నేతలను ఎలాగైనా ఓడిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రతిన బూనింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నియోజకవర్గాల్లో పర్యటించి వదిలేదే లేదని హెచ్చరికలు కూడా చేశారు.

మరోవైపు తెలుగు తమ్ముళ్లు కూడా వీరిద్దరిని ఓడించేందుకు కసితో పనిచేస్తున్నారు. సై అంటే సై అంటూ అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధమౌతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా టీడీపీ ఈ నియోజకవర్గాల్లో ఇంత వరకూ సూత్రప్రాయంగానైనా అభ్యర్దులను ఖరారు చేయకపోవడంతో తెలుగు తమ్ముళ్లు కొంత ఆవేదనకు లోనవుతున్నారు. కొడాలి నాని, వంశీలను ఎదుర్కోవడం ఒక టాస్క్‌గా భావిస్తున్న తరుణంలో సరైన నేతలు లేక టీడీపీ అధిష్టానం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ ఇదస్రు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుండే రాజకీయ అరంగేట్రం చేసినా ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారి ఆపార్టీపై విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమదైన శైలిలో అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తూ తమ పొలిటికల్‌ మైలేజీని పెంచుకుంటున్నారు. ఈ విమర్శలను పూర్తిస్థాయిలో తిప్పి కొట్టే పరిస్థితి ఆనియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది. ఎలాగైనా ఈ నియోజకవర్గాల్లో పాగా వేయాలని కసితో అధిష్టానం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. ఇటీవల రెండు నియోజవకర్గాల్లో జరిగిన పరిణామాలను తెలుగుదేశం పార్టీ కొంత ధీటైన సమాధానాన్ని ఇచ్చినా భవిష్యత్‌లో పార్టీని ముందుకు నడిపించే నేతలు ఆక్కడ లేని పరిస్థితి ఉంది.
ఈనేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆనియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తున్నది. తాజాగా చంద్రబాబు ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటించి కేడర్‌లో ధైర్యాన్ని, స్ఫూర్తిని రగిలించారు. మరికొద్ది రోజుల్లోనే ఈ రెండు నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి ఇన్‌ఛార్జిలను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరోవైపు గన్నవరం లేదా గుడివాడల్లో నందమూరి కుటుంబ సభ్యుల నుండి ఒకరిని ఎన్నికల బరిలో దింపుతారన్న ప్రచారం జరుగుతున్నది. దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసినిని పోటీలో నిలిపే అవకాశాలున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. తొలుత ఇన్‌ఛార్జిలను నియమించిన అనంతరం ఆయా నియోజక వర్గాల్లో పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్ధిని ఖరారు చేయాలనే యోచనలో తెదేపా అధిష్టానం ఉంది.

ఫలించని ప్రయోగాలు
ఇదిలా ఉంటే గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్టుకోసం శ్రమిస్తున్నది. దీనికోసం అనేక ప్రయోగాలు చేస్తూ వస్తున్నది. అయితే ఈ ప్రయోగాలేవీ పూర్తిస్థాయిలో ఫలించని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇటీవల అకాల మరణం చెందారు. దీంతో నియోజకవర్గంలో ఉన్న ఆ ఒక్క పెద్ద దిక్కును టీడీపీ కోల్పోయింది. మరోవైపు ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా అధికార పార్టీలోని కొందరు నేతలు రాజకీయ వ్యూహాలు చేస్తున్న పరిస్తితులు ఉన్నాయి. వీటిని తమకు అనువుగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నది. ఈక్రమంలో దాసరి బాలవర్ధన రావు సోదరులతో టీడీపీ అధిష్టానం మంతనాలు జరుపుతున్నట్లుగా భారీ ప్రచారం జరుగుతున్నది. అయితే, అధిష్టానం ఈ నియోజకవర్గంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అన్న అసక్తి సర్వత్రా నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement