అమరావతి, ఆంధ్రప్రభ : రైతు సమస్యలపై ఉద్యమించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి రైతు పోరుబాట పేరిట బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం పార్టీ నేతలతో చంద్రబాబు తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు సమస్యలపై పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేవలం తన పర్యటనలే కాకుండా క్షేత్రస్థాయిలో నేతలు వివిధ సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రైతు సమస్యలపై తొలుత ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఫైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో మోటార్ల బిగింపు కార్యక్రమం ప్రారంభమయిందని పార్ట నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా మోటార్ల బిగింపుకు వ్యతిరేకంగా సదస్సులను నిర్వహించాలని ఆదేశించారు. దీనిలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోరుబాట పేరిట సీఎం సొంత జిల్లా అయిన కడప నుంచే ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన కడప, 25న నెల్లూరు, జులై 1వ తేదీన కాకినాడ, 7వ తేదీన విజయనగరం, 13వ తేదీన విజయవాడలో ఐదు ప్రాంతీయ సదస్సులను నిర్వహించాలని దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు.
ఛలో మంగళగిరికి సన్నాహాలు..
ఇదిలా ఉంటే మంగళగిరిలో పట్టు సాధించేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తును మొదలుపెట్టింది. దీనిలో భాగంగా త్వరలోనే లక్షమందితో ఛలో మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో నారా లోకేష్ తనదైన శైలిలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో మరింత భరోసాని నింపాలన్న లక్ష్యంపై ఛలో మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న యోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. త్వరలో ఈ కార్యక్రమంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.