Tuesday, November 26, 2024

పార్టీ నేతలకు టీడీపీ అధిష్టానం హెచ్చరిక.. ప్రత్యామ్నాయం చూసుకుంటామని అల్టిమేటం

అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు పూర్తి స్దాయిలో సన్నద్దమవుతోంది.ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా కోల్పోయిన అధికారాన్ని దక్కించుకోవాలని శత విధాల ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతూనే మరో వైపు పార్టీ ప్రక్షాళనకు అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇప్పటికే నేతల పని తీరుపై నిఘా పెట్టిన ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ప్రతి నియోజకవర్గంలో నేతల పని తీరును క్షుణంగా పరిశీలిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. అవసరమైన చోట మార్పులు, చేర్పులకు నిర్ణయం తీసుకుని వాటిని అమల్లోకి తీసుకొస్తున్నారు. గతానికి భిన్నంగా చంద్రబాబు నేతల పని తీరు పట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పని చేయని నేతలకు నేరుగా హెచ్చరికలు చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సంకల్పంతో కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వార్నింగ్‌ లు ఇస్తున్నారు. తాజాగా జరిగిన సమీక్షలు, సమావేశాల్లో చంద్రబాబు పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. పార్టీలో పని చేస్తారా.. లేక తప్పుకుంటారా అని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ కోసం పని చేయలేని వారు ఉంటే తప్పుకోవాలని ప్రత్యామ్నాయం చూసుకుంటామని తేల్చి చెప్పడంతో నేతలు షాక్‌ అయ్యారు. పని చేస్తానని చెబుతూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని కఠినమైన నిర్ణయాలు, యాక్షన్‌ ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే కొన్ని నియోజకవర్గాల ఇంచార్జ్‌ ల మార్పుకు నిర్ణయం తీసుకుని వాటిని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పార్టీ నేతలు ఇప్పుడు ఎక్కడి వారు అక్కడే సర్దుకుని కార్యక్రమాల నిర్వాహణకు సిద్దమవుతున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వాహణలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలు చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌ లతో మళ్ళీ నియోజకవర్గాల్లో బిజీ అయ్యే పనిలో ఉన్నారు. ఇంకొకవైపు రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేయటం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. పొత్తులపై క్లారిటీ వస్తుందని నేతలు భావిస్తున్న సమయంలో విరుద్దమైన ప్రకటన రావడం వారిని షాక్‌ కు గురిచేసింది .అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియక నేతలు తికమక పడుతున్నారు.

ద్వితీయ శ్రేణి నాయకత్వంపై అధిష్టానం చూపు..

పార్టీ నేతల పనితీరుపై కొంత అసంతృప్తితో ఉన్న టీడీపీ అధిష్టానం ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఫోకస్‌ పెట్టింది. పని తీరు సరిగ్గా లేని నేతలను పక్కకు పెట్టి ద్వితీయ శ్రేణి నేతలకు అక్కడ అవకాశం కల్పించాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. అలాగే అనేక నియోజకవర్గాలో టిక్కెట్ల కోసం భారీగా దరఖాస్తులు అధిష్టానానికి అందుతున్నాయి. పార్టీ కార్యక్రమాల నిర్వాహణ , ఇతర అంశాల్లో పనితీరు మెరుగుపరుచుకోని నేతలకు ఉద్వాసన పలికి ఆయా స్థానాల్లో కొత్త వారికి ,ఆశావహులకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇదే సమయంలో వర్గ విభేధాలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై కూడా ఆయన సీరియస్‌ గా ఉన్నారు. ఇప్పటికే వారిని తన వద్దకు పిలిపించుకుని కఠినమైన హెచ్చరికలు చేశారు. ఇప్పుడు పార్టీ ప్రకటించిన భవిష్యత్‌ కు గ్యారెంటీ మినీమ్యానిఫె స్టో చైత న్య యాత్రలు సాగుతున్న తీరును అధిష్టానం పూర్తి స్థాయిలో గమనిస్తోంది. ఈ కార్యక్రమంలో సైతం వెనుకబడిన తెలుగుతమ్ముళ్ళను ఆయా నియోజకవర్గాల నుంచి పక్కకు పెట్టి కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చింది. ఈ నేపథ్యంలో ఎంత మంది నేతలు తమ పని తీరును మెరుగుపర్చుకుని అధిష్టానం ఆగ్రహానికి గురి కాకుండా తమ పదవులు, టిక్కెట్లను కాపాడుకుంటారో వేచి చూడాల్సిందే ..

Advertisement

తాజా వార్తలు

Advertisement