ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. విశాఖలోని మానసిక వికలాంగుల పాఠశాల నిర్మాణాల తొలగింపుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడడం దారుణమని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల కోసం ఆ పాఠశాలను లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. దాని ద్వారా పేద కుటుంబాలకు చెందిన 190 మంది సేవలు పొందుతున్నారని చెప్పారు. నష్టపోయిన బాధిత వర్గానికి వెంటనే న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ప్రజలకు లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తోన్న సంస్థ నిర్మాణాలను సీజ్ చేయడం సరికాదన్నారు. పాఠశాలలో చదువుతున్న పిల్లలలో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన వారేని ఆయన చెప్పారు. పాఠశాలకు ఎటువంటి వ్రాతపూర్వక నోటీసు ఇవ్వకుండా సహజ న్యాయం సూత్రాలకు వ్యతిరేకంగా కూల్చివేత జరిగిందని మండిపడ్డారు. మానసిన వికాలాంగుల పిల్లల పాఠశాలను కూల్చివేసిన తరువాత వైసీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండటానికి నైతిక హక్కును కోల్పోయిందన్నారు. ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో డిమాండ్ చేశారు.