కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సీఎం జగన్ ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మాని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అకారణంగా తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. టీడీపీ నాయకులు, బనగానపల్లె మాజీ శాసనసభ్యులు బిసి జనార్థన్ రెడ్డితోపాటు పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. కరోనాను నియంత్రించేదానికన్నా ప్రతిపక్షాలను నియంత్రించడమే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన తీరు మూడు అక్రమ కేసులు ఆరు అరాచకాలు అన్నట్లుగా సాగుతోందని విమర్శించారు. దాడికి పాల్పడ్డ వైసీపీ నేతలను వదలిపెట్టి దాడిని అడ్డుకున్న జనార్థనరెడ్డిని అరెస్టు చేయడం రాజారెడ్డి రాజ్యాంగం కాదా? అని ప్రశ్నించారు. వివాదాలకు దూరంగా ఉండే బీసీ జనార్దన్ రెడ్డి లక్ష్యంగా అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.