Friday, November 22, 2024

TDP – బందిపోటు పీడ పోవాలంటే అంద‌రూ ఏకం కావాల్సిందే – చంద్ర‌బాబు

జ‌గ్గంపేట – ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఏ వ్యవస్థను వదిలిపెట్టకుండా జ‌గ‌న్ నిర్వీర్యం చేశార‌ని మండిపడ్డారు టిడిపి అధినేత చంద్ర‌బాబు. జగన్ చేసేదంతా విధ్వంసమేనని విమర్శించారు. కేసుల పేరుతో టిడిపి నేతలను వేధిస్తున్నారని. రాష్ట్రంలో వైకాపా విధ్వంసం సృష్టించిందని అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నేడు జరిగిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ…
నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను ఎక్కడా చూడలేదని అన్నారు. తన జోలికి రావాలంటే అందరూ భయపడతారని, కానీ ఇతడు సైకో కాబట్టి భయమేమీ లేకుండా ఏమైనా చేస్తాడని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో తాను కూడా బాధితుడినే అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ, విద్యాశాఖ పనిచేయడంలేదని, ప్రజలకు ఆరోగ్యం అందడంలేదని అన్నారు. ఈ సైకో జగన్ వల్ల అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు పోయాయి అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

“జడ్జిలను తిట్టేవాళ్లను, సీబీఐ కేసు ఉన్నవాళ్లను పక్కనబెట్టుకుని ఊరేగుతున్నారు. ప్రజలు ఇతని ప్రవర్తనను గమనించాలి. రాష్ట్రాన్ని సర్వం దోచేశారు… పెరుగు, మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్లు పోస్తున్నారు. ఇతడికి డబ్బుల పిచ్చి… డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. అందుకే జే బ్రాండ్ పేరుతో నాసిరకం మద్యం తీసుకువచ్చారు. నేను ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ రూ.60… ఇప్పుడు రూ.200! మీ డబ్బులు రూ.140 దొబ్బేస్తున్నాడు ఈ జలగ సైకో జగన్. ఈ మద్యం షాపులో అయినా ఆన్ లైన్ పేమెంట్లు ఉన్నాయా? అందులో రహస్యం ఏంటి? ఇవాళ టీకొట్లు, తోపుడు బళ్లలో కూడా ఆన్ లైన్ పేమెంట్లు ఉన్నాయి. కానీ మద్యం షాపుల్లో మాత్రం లేవు. ఇలా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దెబ్బతీశాడు. మద్యపాన నిషేధం అన్నాడు… చేశాడా? మద్యపాన నిషేధం తర్వాతే ఓటు అడుగుతా అని చెప్పిన నీకు ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఉందా?
ప్రత్యేక హోదా తెచ్చారా? సీపీఎస్ రద్దు చేస్తానన్నారా లేదా? కరెంటు చార్జీలు తగ్గిస్తానన్నారా లేదా? తగ్గించకపోగా, తొమ్మిదిసార్లు పెంచారు. నా పాలనలో నేను కరెంటు చార్జీలు పెంచలేదు. సమర్థుడైన నాయకుడి పాలనలో చార్జీల పెంపు ఉండదు.

- Advertisement -

జగన్ మోహన్ రెడ్డి ఒక మాట చెబుతున్నారు… అందరూ ఏకమై వస్తున్నారంట… ఆయన ఒక్కడే వస్తున్నాడంట… ఆయన సింహం అంట! ఒక దొంగ… ఒక దోపిడీదారుడు… మీ ఇంటి మీదికి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది తీసుకుని రోడ్డు మీదికి వస్తారు, ఊరంతా ఏకమవుతారు, అందరూ కలిసి దొంగను తరుముతారు. రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో బందిపోటు దొంగొచ్చాడు… దోపిడీదారుడు వచ్చాడు… రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

ఇవాళ మేం సూపర్-6 తీసుకువచ్చాం. ఆడబిడ్డ నిధి కింద మహిళలు ఒక్కొక్కరికి రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే రూ.15 వేల చొప్పున ఇస్తాం. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. అన్నదాతను ఆదుకునే క్రమంలో రైతులకు ఏడాదికి రూ.20 వేలు సాయం అందిస్తాం. రైతును రాజుగా చేస్తాం.

ఇవే కాకుండా… వృద్ధులందరికీ హామీ ఇస్తున్నా… నెలకు రూ.4 పెన్షన్ ఇస్తాం. ఏప్రిల్ నుంచే వర్తించేలా ఇంటి వద్దనే పెన్షన్ అందిస్తాం. ఒక నెల తీసుకోకపోయినా, రెండో నెల తీసుకోకపోయినా మూడో నెల కూడా పెన్షన్ ఇస్తాం. పెన్షన్ పథకం తీసుకువచ్చిందే తెలుగుదేశం పార్టీ. రూ.200 పెన్షన్ ను రూ.2 వేలు చేసింది తెలుగుదేశం పార్టీ. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఏదో ఇళ్లు కట్టానని చెబుతున్నాడు… ఇళ్లు కట్టాడా, గూళ్లు కట్టాడా? ఆ ఇళ్లలో పడుకోవడానికైనా సరిపోతుందా? నేను బ్రహ్మాండమైన టిడ్కో ఇళ్లు కట్టాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా… పేదలందరికీ 2 సెంట్లు గానీ, 3 సెంట్లు గానీ స్థలం ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇళ్లు కట్టిస్తాం… టిడ్కో ఇళ్లు పూర్తిగా ఉచితంగా మీకే ఇస్తాం” అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement