పరచూరు – ఒక వ్యక్తి అహంకారానికి రైతులు బలైపోయారని టిడిపి అదినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు..వరదల నష్టాలతో నిన్న ఒక్కరోజే నలుగురు రైతుల ఆత్మహత్య చేసుకున్నారని.. ఎగువన ప్రాజెక్టులు కట్టడం వల్ల కృష్ణా నదిలో నీళ్లు తగ్గాయన్నాని అన్నారు. తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారని.. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని అన్నారు… ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన పర్చూరు మండలం చెరుకూరులో ఆయన నేడు పర్యటించారు..
ఈ సందర్భంగాగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క రోడ్డు బాగుందా.. అన్ని వ్యవస్థలు నాశనం చేశారని జగన్ పై మండిపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు మళ్లీ కొట్టుకుపోయింది.. గుండ్లకమ్మ గేటు కూడా కాపాడలేని ముఖ్యమంత్రి దద్దమ్మ ఉపన్యాసాలు చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి ఎవరు కారణం అంటూ ఆయన ప్రశ్నించారు.
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఎవరు కారణం అని అడుగుతున్నామన్నారు. గేట్లు రిపేరు చేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అంటూ ఎద్దేవా చేశారు. రెండు టీఎంసీల నీళ్లు గుండ్లకమ్మ నుంచి సముద్రంలోకి వెళ్లాయి అది నా బాధ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇసుక పైన ఉన్న ప్రేమ రైతులపై, అభివృద్ధిపై లేదన్నారు. రైతుల బాధ పట్టించుకోని ముఖ్యమంత్రిని దేవుడు ఎలా క్షమిస్తాడని.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన నష్టపరిహారాన్ని కూడా తగ్గించి ఇస్తున్నారన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోయిందన్నారు. రైతులు తరపున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చంద్రబాబు తెలిపారు. రైతు రాజ్యం తీసుకురావడానికి టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. తుపాను కారణంగా భారీ నష్టం జరిగితే ముఖ్యమంత్రి కేంద్రాన్ని సాయం కూడా అడగలేదన్నారు. ఏపీకి సాయం కోసం ప్రధానికి తానే లేఖ రాస్తానని చంద్రబాబు వెల్లడించారు.