Friday, November 22, 2024

TDP – కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటాం – ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుంటాం: చంద్రబాబు

పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ‌వారికి గుర్తింపు
ఎందరో ఎన్నో బాధలు పడ్డారు
ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నారు
పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లారు
ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు
కార్య‌క‌ర్త‌ల‌ను ఆదుకోవటమే మా విధి
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు

ఆంధ్రప్రభ స్మార్ట్, మంగళగిరి :
ఆపదలోని కార్యకర్తలను ఏ విధంగా ఆదుకుంటామో చేసి చూపిస్తామని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ‌నివారం పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో భాగంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ₹100 తీసుకుని సీఎం చేతుల మీదుగా మెుదటి సభ్యత్వాన్ని నమోదు చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలని ఈ సందర్బంగా చంద్రబాబు టీడీపీ శ్రేణులను సూచించారు.

- Advertisement -

కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి..

పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందల, వేల మంది కార్యకర్తల కృషి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ పార్టీ సేవలు అందిస్తోందన్నారు. పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు, నేతలు వివిధ స్థాయిల్లో కష్టపడి పని చేశారని ఆయన తెలిపారు. పార్టీ కోసం పోరాడి అనేక కేసులు పెట్టించుకున్నారని, జైలుకు వెళ్లారని, ఆస్తులు పోగొట్టుకున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి కార్యకర్తలకు కచ్చితంగా టీడీపీ పార్టీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన పలువురు కార్యకర్తలతో ఆయన వీడియో కాల్ లో మాట్లాడారు. గతంలో బీమా రాని 73 మందికి రూ.2లక్షల చొప్పున చంద్రబాబు అందించారు.

అయిదు లక్షల ప్రమాద బీమా..

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు తీసుకున్నారు. అదే విధంగా సభ్యత్వం తీసుకున్న వారికి ₹2 లక్షల నుంచి ₹5 లక్షల వరకూ ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రూ.లక్ష కడితే పార్టీలో శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. ప్రమాదవశాత్తూ చనిపోతే మట్టి ఖర్చుల కింద ₹10 వేలు తక్షణసాయం అందజేస్తారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్థికసాయం అందిస్తారని తెలిపారు.

కర్నూలులోనూ..
కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూ.లక్ష కట్టి మంత్రి భరత్ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సభ్యత్వం తీసుకున్న వారికి అనేక ప్రయోజనాలు ఉంటాయని, ఆపద సమయంలో పార్టీ అండగా నిలబడుతుందని ఆయన హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement