మంగళగిని – వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారనడం అవాస్తవమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘ప్రకాశించని నవరత్నాలు.. జగన్ మోసపు లీలలు’ పేరిట టీడీపీ రూపొందించిన వాస్తవ పత్రాన్ని ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ చెప్పేవన్నీ అసత్యాలేనని, ఒక్కటీ నిజం ఉండదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒకటి చెప్పి.. అధికారంలోకి వచ్చాక మరొకటి చేస్తున్నారని విమర్శించారు.
నవరత్నాలే కాకుండా జగన్ మరో 40 హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటైన అమలు చేశారా అంటూ నిలదీశారు.. అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. రూ.13 వేలు ఇస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో 84 లక్షల మంది అర్హులైన మహిళలుంటే 42 లక్షల మందికే అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేయటం ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘తల్లికి వందనం’ కార్యక్రమం తీసుకొచ్చి.. ప్రతి మహిళకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.