Friday, November 22, 2024

గెలుపే ల‌క్ష్యం – పార్టీలో ప్ర‌క్షాళ‌న‌కు తెలుగుదేశం శ్రీకారం..

అమరావతి, ఆంధ్రప్రభ: రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో తెదేపా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీనికోసం అహర్నిశలు శ్రమించడమే కాకుండా తన రాజకీయ చాణిక్యానికి పదును పెడుతూ. సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్ర బాబు వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ నేతల పనితీరు సక్రమంగా లేని పరిస్థితుల్లో ఆయా ప్రాంతా ల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక పరిశీలకులను నియమిస్తూ పార్టీ పూర్తిస్థాయిలో పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు కీలక నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూనే ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం, విశాఖ, గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించే దిశగా టీడీపీ అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలకు ప్రత్యేక పరిశీలకులను అధిష్టానం నియమించింది. ఇప్పుడు అదే బాటలో కొన్ని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మరికొంతమంది పరిశీలకులను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో కేవలం ద్వితీయ శ్రేణీ నేతలే పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులతో పాటు పార్టీ పరంగా నిత్య పర్యవేక్షణ సాగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఈ అంశంపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు ఉన్న నియోజకవర్గాలకు కో – ఆర్డినేటర్లతో పాటు పరిశీలకుల నియామకాన్ని చేపట్టనుంది.

ఇన్‌ఛార్జిల మార్పు..
పార్టీలో ప్రక్షాళన చేయాల్సిన అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించడమే కాకుండా థర్డ్‌ పార్టీతో పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకుంటూ, దానికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. ఇదే సమయంలో గ్రూపు విభేదాలకు స్వస్తి పెట్టేందుకు ముమ్మరమైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా యువతరాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ అధిష్టానం, ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా నాలుగు నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు ఉద్వాసన పలికిన అధిష్టానం, వారి స్థానంలో కొత్త వారిని నియమించి పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. నేతలు ఎంతటివారైనా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని భావిస్తున్న అధిష్టానం తాజాగా ఇన్‌చార్జిల మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దాదాపు పది నియోజకవర్గ ఇన్‌చార్జిలకు ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టమైన సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement