Friday, November 22, 2024

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా టీడీపీ చేష్టలు : విజ‌య‌సాయిరెడ్డి

అభివృద్ది కేంద్రీకరణను ప్రోత్సహిస్తూ, కొందరి ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టేలా ర్యాలీలకు ప్రోత్సహిస్తున్న టీడీపీ అమరావతిలోనూ ఓటమి పాలైంద‌ని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి గుర్తుచేసారు. సోమవారం ట్విట్టర్‌ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ప్రచారం కోసం బూతులు మాట్లాడుతూ యాత్రలంటూ రెచ్చగొడితే ఓట్‌ బ్యాంకు సన్నగిల్లి ఉన్ననాలుగు సీట్లు కూడా గల్లంతవుతాయని తెలుగుదేశం పార్టీ నేతలకు హితవు పలికారు. ప్రజాహిత కార్యక్రమాలు గాలికి వదిలేసి, నీచపు కుట్రలకు పాల్పడుతున్నతీరు మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆడియోతో మరోసారి బయటపడిందన్నారు. వైరల్‌గా మారిన ఈ సంభాషణలో ఒక మహిళా ఉద్యోగినిని లైంగిక వేదింపుల కేసు పెట్టమని ఉసిగొల్పినట్లు వెల్లడయ్యిందని, ఇదేమి రాజకీయం బాబూ అని ఎద్దేవా చేసారు.


లిప్‌తో విద్యార్ధులకు ఇంగ్లీష్‌ భాషా నైపుణ్యం :
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్దులకు ఇంగ్లీష్‌ భాషా నైపుణ్యం పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌ మెంట్‌ ప్రోగ్రాం (లిప్‌) వినూత్నంగా రూపొందించిందని అన్నారు. రాష్ట్రంలో ఉభయగోదావరి, క్రిష్ణా జిల్లాల్లో ముందుగా ఈ కార్యక్రమం అమలు కానుందన్నారు. లిప్‌ ప్రోగ్రాంలో భాగంగా 1, 2 తరుగతి విద్యార్దులకు రోజూ రెండు కొత్త పదాలు అభ్యాసం చేయిస్తారని, 3, 4, 5 తరగతుల విద్యార్దులకు 3 పదాలు, 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్దులకు ప్రతిరోజు ఐదు కొత్త పదాల అభ్యాసం ఉంటుందన్నారు. కొందరు నానా యాగీ చేస్తున్నారు.. కానీ ఎయిడెడ్‌ స్కూల్‌ టీచర్లు మాత్రం సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్లెక్సీలకు క్షీరాభిషేకం చేస్తున్నారన్నారు. క్షీణదశలో ఉన్న ఎయిడెడ్‌ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఏపీ ఎయిడెడ్‌ టీచర్ల గిల్డ్‌ హర్షం వ్యక్తం చేసిందన్నారు. యాజమాన్యాలపై ఒత్తిడిలేదని పిల్లల భవిష్యత్తే ముఖ్యమన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న తెలుగుతేజం, స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ సీవీ సింధుకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఒలింపిక్‌ గేమ్స్‌ లో రెండు సార్లు పతకాలు సాధించి భారత క్రీడాకారులందరికీ స్పూర్తిగా నిలిచిన సింధు ఈ పురష్కారం అందుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ ఒడిదుడుకులు కరోనాతో మరింతగా కుదేలవ్వడం మనందరమూ చూసామని తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన నివేదికతో పరిస్థితి ఆశాజనకంగా మారినట్లు కనిపిస్తోందని అన్నారు. చలామణిలో ఉన్న నగదు రూ.26.88 లక్షల కోట్లకు చేరడం శుభపరిణామమని అన్నారు. జీడీపీ పెరుగుదలకు ఇది అనుకూల సూచన అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement