Friday, November 22, 2024

TDP Alliance – సెంట్రల్​లోనూ సూపర్ సిక్స్! మోదీ ప‌రివారంలో ఆరు బెర్తులు గ్యారెంటీ

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి :

ప్రధాని మోదీ 3.0 జమానాలో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది. మోదీ హ్యట్రిక్ చరిత్రకు ఏపీ ఎంపీలే కీలకాధారం అయ్యారు. పదేళ్లుగా పార్లమెంటులో తగిన బలం ఉన్నప్పటికీ… కేంద్రం పెద్దలు కనీసం కన్నెత్తని చూడని స్థితిని ఏపీ ఎంపీలు ఎదుర్కొన్నారు. ఇక సీఎంలు.. ప్రధాని మోదీ ప్రసన్నత.. అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూసిన ఘటనలెన్నో ఉన్నాయి. కానీ, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ ఏపీకి పున‌ర్ వైభ‌వం రానున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. 1998 నుంచి 2004 నాటి కాలం మళ్లీ వ‌స్తుంద‌న్న ప్ర‌జ‌ల్లో ఆశ‌ల‌ను చిగురింప‌జేస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి సర్కారును నిలబెట్టటంలో.. అప్పటి సీఎం చంద్రబాబు ఎలాంటి పాత్ర పోషించారో.. తాజా పార్లమెంటులోనూ అదే చక్రం తిప్పే అవకాశం లభించింది. ఈ స్థితిలోనే మోదీ సర్కారులో ఎంత మంది ఏపీ ఎంపీలు కేంద్ర మంతులవుతారనే అంశం ప్రస్తుతం చ‌ర్చ‌కు వ‌స్తుండ‌గా.. ఇదే అంద‌రిలో ఉత్కంట‌కు గురిచేస్తోంది.

- Advertisement -

ఏపీ కూటమికి సూపర్ సిక్స్

నరేంద్ర మెదీ కేబినెట్లో ఏపీ ఎంపీలకు నాలుగు లేదా ఐదు బెర్తులు లభించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి ముగ్గురికి, బీజేపీ, జనసేన నుంచి ఒక్కొక్క‌రికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. కనీసం నాలుగు మంత్రి పదవులు, లోక్ సభ స్పీకర్ కోసం టీడీపీ యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీకి రెండు మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా, బీజేపీ నుంచి పురందేశ్వరికి ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన నాయుడు, గోదావరి జిల్లాల నుంచి గంటి హరీశ్‌, పుట్టా మహేశ్‌ యాదవ్, కోస్తా జిల్లాల నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులు, వేముల ప్రభాకర రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, రాయలసీమ నుంచి బీకే పార్థసారథి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక‌.. ఏపీ బీజేపీలో ఒకరికే చాన్స్ దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో పురందేశ్వరి పేరు బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంద‌ని స‌మాచారం. కేంద్ర మంత్రి వర్గంలో చోటు కోసం అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెరమీదకు కొత్త ఫార్ములా

ఈసారి కేంద్రంలో బీజేపీకి కావాల్సినంత మెజార్టీ లేకపోకపోవడంతో మిత్రులపై ఆధారపడక తప్పలేదు. ఇక కేబినేట్‌లో కీలక శాఖలపై మిత్రుల డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ స్థితిలో బీజేపీ కొత్త ఫార్ములాను తెరపైరి తీసుకొచ్చింది. ఎన్డీయేలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లను టీడీపీ గెలుచుకుంది. తెలుగుదేశానికి 16 ఎంపీ సీట్లు వచ్చాయి. ఎన్డీయే భేటీకి హాజరైన చంద్రబాబును, కేంద్ర మంత్రి వర్గంలోకి రావాలని మోదీ ఆహ్వానించారు. టీడీపీ అధినేత ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఎన్ని పదవులు ఇవ్వాలనేది కీలకంగా మారింది. ఇక బీజేపీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ నేతలు నడ్డా నివాసంలో గురువారం భేటీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో 15 శాఖలు కీలకంగా మారాయి. ఎన్డీయేలోని మిత్రులు దాదాపు ఆయా శాఖలపై కన్నేశారు. దీంతో బీజేపీకి పెద్ద సమస్య వచ్చిపడింది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది. నలుగురు ఎంపీలకు ఒక మంత్రి చొప్పున చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ లెక్కన టీడీపీ నాలుగు, జేడీయూకు మూడు, జేడీఎస్ కు, జనసేనకు ఒకటి దక్కనున్న‌ట్టు తెలుస్తోంది.

కాషాయ వ్యూహం

ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, కామర్స్, హెచ్ఆర్డీ శాఖలను తమ వద్ద ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. మిగతా శాఖలను మిత్రులకు సర్దుబాటు చేయాలనే యోచనలో ఉంది. ఎలా చూసినా ఈసారి ఏపీకి మూడు నాలుగు కేంద్ర పదవులు రానున్నాయని తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేస్తున్నారు. టీడీపీ నాలుగు, ఏపీ బీజేపీకి ఒకటి లేదా రెండు, జనసేనకు ఒకటి వస్తుందని అంచనా వేస్తున్నారు వీటిలో రోడ్డు, షిప్పింగ్, ఐటీ, పట్టణ గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖలను తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. అన్నిటికంటే స్పీకర్ పదవిని టీడీపీ డిమాండ్ చేసినట్టు సమాచారం. కానీ బీజేపీ తలూపలేదని ప్రచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement