అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆయన నివాసంలో ఆ పార్టీ శాసన సభాపక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. అప్పుల ఊబిలో రాష్ట్రం, సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు వేల ఎకరాల కేటాయింపు- అనుచిత రాయితీలు తదితర అంశాలపై చర్చించారు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల బాదుడు, స్థానిక సంస్థల నిధుల దారి మళ్లింపు, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సభలో చర్చకు తీసుకురావాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
విశాఖ రైల్వే జోన్‌కి అవసరమైన భూమి అప్పగించకుండా రాష్ట్రప్రభుత్వం మోకాలడ్డటంపై టీడీఎల్పీ చర్చించింది. కరవు మండలాల ప్రకటనలో వైఫల్యం, మిచౌంగ్ తుపాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపైనా శాసనసభాపక్షం సమాలోచనలు జరిపింది. పవన్ కల్యాణ్‌తో భేటీ సారాంశాన్ని చంద్రబాబు నేతలతో పంచుకున్నారు. త్వరలో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున అభ్యర్థిని నిలబెట్టే అంశంపైనా చర్చ జరిగినట్టు సమాచారం. సమావేశాల్లో మొత్తం పది అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం భావిస్తున్నట్లు సమాచారం ..