- పది వేల మందికి ఉపాధి ప్రకటించిన నారా లోకేష్
- పెదఅయినం గ్రామంలో రతన్ టాటా విగ్రహం ఆవిష్కరణ
- రతన్ చేసిన సేవలను స్మరించుకున్న మంత్రి
- విద్యార్ధులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపు
- భీమవరం – మూడు నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏపీలో తీసుకురాబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పదివేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పారు. ప్రపంచానికి టాటా బ్రాండ్‌ను పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా అన్నారు. విలువలతో కూడిన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని తెలిపారు. భీమవరం పర్యటనకు వచ్చిన ఆయన పెదఅయినంలో రతన్‌టాటా కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు. హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ.25 కోట్లు, హుద్ హుద్ తుపాను సమయంలో మూడు కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా అని గుర్తుచేశారు.
ట్రిపుల్ ఆర్ కు ప్రశంసలు ….
ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫైర్ బ్యాండ్ అని మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉండి నియోజకవర్గ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. విద్యార్థులను చూస్తుంటే తన కాలేజ్ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు తోడుగా ఉన్నది తన మిత్రులు, బంధువులు అనే చెప్పారు. టీడీపీకి ఉండి నియోజకవర్గం కంచుకోట అన్నారు. ఆర్ఆర్ఆర్ అంటే రియల్, రెస్పాన్సిబుల్ అండ్ రెబల్ అని కొనియాడారు. ఏ పోలీసులయితే ఆయనను కొట్టారో వారికి సొంత నిధులతో వాహనాలు కొనిచ్చారని చెప్పారు.
ఆర్థికంగా కష్టాలలో ఉన్నాం…
ఏపీ చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, ప్రతీనెల రూ. 4 వేల కోట్లతో ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. ఈ సంక్షోభాన్ని విద్యార్థులు ఒక అవకాశంగా మలుచుకోవాలని చెప్పారు. విద్యాశాఖ చాలా కష్టమైన శాఖ అని తెలిపారు. కష్టమైన శాఖలను ఎంచుకోవడం తనకు ఇష్టమన్నారు. కష్టకాలంలో మనతో నిలబడిన వారితో కలిసి వెళ్లాలని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను మార్చాలని భావిస్తున్నామని అన్నారు. పాఠ్య పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు లేవు అని చెప్పారు. పార్టీల రంగులు లేవు, తమకు ఆ పిచ్చి లేదని అన్నారు. డ్రగ్స్ వద్దు క్యాంపెయిన్ రూపొందించామని తెలిపారు. విద్యార్థులు అటువంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.