అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అందజేసే భోజనాన్ని మరింత రుచికరంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఉల్లిపాయ, టమోటా తదితర కూరగాయలు, వంట నూనెల ధరలు పెరగడం ఇతర కారణాలతో వంటలలో రుచి తగ్గి భోజనం చేసే విద్యార్ధుల సంఖ్య సన్నగిల్లుతున్నదని ఫిర్యాదులు అందుతున్నాయి.
ప్రస్తుతం అందిస్తున్న రుచి, నాణ్యతను పాటిస్తూ భోజనం మెనూలో స్వల మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూలో మార్పు చేయాలని భావిస్తున్నారు. భోజనంలో అందించె కూరలలో మరింత నాణ్యతా ప్రమాణాలు పెంపొందించి రుచికరంగా అందించేలా చర్యలు చేపడుతున్నారు.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ప్రతి నెలా ఏజెన్సీ స్టాక్ పాయింట్లకు అందుతున్న కోడిగుడ్లు, వేరుశనగ చిక్కీలు, రాగిజావ తదితరాలను ఎప్పటికపుడు పరిశీలించి నాణ్యతా లోపాలకు చెక్ పెట్టనున్నారు. మార్పులు చేసిన సరికొత్త మెనూను దీపావళి నుంచి అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
డొక్కా సీతమ్మ బడి భోజనం మెనూ ఇలా…
సోమవారం: ఉడికించిన గుడ్డు లేదా వెజిటేబుల్ పలావు, కోడి గుడ్డు కూర, వేరుశనగ చిక్కీ
మంగళవారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడి గుడ్డు
బుధవారం: వెజిటేబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరు శనగ చిక్కీ
గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్ / నిమ్మకాయ పులిహోర (టెమన్ రైస్), -టొ-మాటో పచ్చడి, ఉడికించిన కోడి గుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడి గుడ్డు, వేరుశనగ చిక్కీ
శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు. స్వీట్
పొంగల్
కొత్త మెనూలో రానున్న మార్పులు ఇలా…
సాంబార్ బాత్‌ను రెండూ కలిసి కాకుండా వేర్వేరుగా వడ్డించే విధంగా మార్పు తీసుకురానున్నారు. వారంలో ఐదు రోజులు ఇస్తున్న గుడ్డును.. మూడు రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావలో సుగంధ ద్రవ్యాలు కలపాలపాలని యోచిస్తున్నారు. పచ్చళ్లలో గోంగూర లేదా బీర/వంకాయలను కూడా చేర్చాలని భావిస్తున్నారు.
వారంలో అన్ని రోజులూ రాగిజావ ఇవ్వకుండా కేక్, లడ్డూలను డ్రైపూట్స్‌తో కలిపి ఇచ్చేలాగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుం ఉన్న బియ్యం స్థానంలో సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల పిల్లలకు వంద గ్రాములు, పై తరగతతులకు 150 గ్రాముల బియ్యం కేటాయిస్తున్నారు.
వీటి పరిమాణం మరింత పెంచనున్నారు. గ్యాస్‌ను రాయితీ ధరకు అందించనున్నారు. భోజన పదార్ధాలను తయారీకి అల్యూమినయం పాత్రలు సమకూర్చనున్నారు. వారానికి ఒక రోజు మోనూలో అరటి పండు, మజ్జిగ కూడా చేర్చేలాగా మెనూపై కసరత్తు చేస్తున్నారు.