Tuesday, November 26, 2024

అక్రమ లే అవుట్లపై గురి…

కర్నూలు, ప్రభన్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడంతో నిధుల కొరత ఎదుర్కుంటుంది. దీంతో నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో నిన్నటి వరకు జిల్లాలో ఓటీఎస్‌ పేరుతో రూ. కోట్లు రాబట్టుకున్న ప్రభుత్వం తాజాగా జిల్లాలో రియల్‌ వెంచర్లు, అక్రమ లే అవుట్లపై దృష్టి సారించింది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలు అనాధికార లే అవుట్లకు అడ్డాగా మారుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాట్‌లు వేస్తున్నారు. అధికారులు ముడుపుల మత్తులో జోగుతూ అక్రమ లే అవుట్లకు పచ్చజెండా ఊపుతున్నారు. అనధికార లే అవుట్లకు చెక్‌ పెట్టి, తద్వారా ఆదాయంను సమకూర్చుకోవాలన్న తలంపుతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పట్టణాలు, నగరాలలో, గ్రామాలలో అక్రమ లే అవుట్లను గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఇటీవల కలెక్టర్‌లకు, పంచాయితీ రాజ్‌ కమిషనర్ణు ఆదేశించింది. దీంతో ఏపి వ్యవసాయ భూముల చట్టం- 2006 మేరకు భూ వినియోగ మార్పిడీ ఫీజు చెల్లించని లే అవుట్లపై పూర్తిస్ధాయిలో కసరత్తు మొదలు పెట్టింది. జిల్లాలో సుమారు ఐదువేల ఎకరాల్లో వ్యవసాయ భూమిని సాగేతర అవసరాలకు నిబంధనలకు విరుద్దంగా మళ్లించినట్లు గుర్తించింది. వాటిలో దాదాపు 200కు పైగా అక్రమ లే అవుట్లు వేసినట్లు రెవెన్యూశాఖ ప్రభుత్వంకు నివేదిక అందజేసింది. అక్రమంగా వేసిన లే అవుట్ల నుంచి తాజాగా ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం అసలు, పెనాల్టీ కలిపి వసూళ్లు చేయాలని ప్రభుత్వం అధికారులకు దిశ, దశ నిర్దేశం చేసింది. గట్టిగా వసూళ్లు చేస్తే జిల్లాలో కోట్ల ఆదాయం ప్రభుత్వంకు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరి నాటికి వీటిని వసూళ్లు చేసే ందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతంలోని లే అవుట్లపై దృష్టిని సారించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులు చెల్లించకపోతే సంబందిత వాటికి రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయాలన్న ఆదేశాలున్నాయి. అక్రమ లే అవుట్‌ వేస్తే ఆ లేఅవుట్‌ను రిజిస్ట్రేషన్‌ నిషేదిత జాబితాలో చేర్చడం జరుగుతుందని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ పి. కోటేశ్వరావు ఆదేశించగా, తాజాగా నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహాత్‌ బాజ్‌పాయ్‌ మంగళవారం ప్రకటించడం గమనార్హం. రెవెన్యూ డివిజన్‌లోని వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమిగా మార్పు చేయకుండా ఇతర అవసరాల కోసం అనగా అక్రమ లే అవుట్లు వేస్తే అటువంటి లే అవుట్లను గుర్తించి తహాశిల్దార్‌ ద్వారా నోటిసులు పంపారు. కాని ఇంత వరకు వ్యవసాయేతర పన్ను, అపరాధ రుసుముతో పన్ను చెల్లించలేదు. కావున ఈ విధమైన నోటీసులు తీసుకున్న రియల్‌ వ్యాపారులు తక్షణమే అపరాధ రుసుంతో సహా చెల్లించాలి లేకుంటే వారి లే అవుట్లను రిజిస్ట్రేషన్‌ శాఖలో నిషేదిత జాబితాలో చేర్చనున్నారు.

సొంతింటి కలపై తీవ్ర ప్రభావం..

ల్యాండ్‌ కన్వర్షన్‌ స్కీమ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 145 శరఘాతం కానుంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని నగర,పురపాలక, పట్టనాభివృద్ది, మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు చేరాయి. లే అవుట్‌ అనుమతికి దరఖాస్తు చేసుకున్న వారు లే అవుట్లో 5 శాతం స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. స్థలం ఇవ్వలేని పక్షంలో 5 శాతం స్థలానికి మార్కేట్‌ విలువ చెల్లించాలి. రెండు కాని పక్షంలో సంబందిత స్థలంకు మూడు కిలో మీటర్ల పరిధిలో మరో స్థలం కొనివ్వాలి. ఇలా సేకరించిన స్థలాన్ని, డబ్బును జగనన్న కాలనీల డెవలఫ్‌మెంట్‌ కోసం ప్ర భుత్వం వి నియోగించనుంది. సాధారణంగా రియల్‌ వ్యాపారులు లే అవుట్‌లు వేస్తే ఆయా లే అవుట్‌ విస్తీర్ణంలో ఎకరాలో 30 శాతం రమాదారుల నిర్మాణంకు, 10 శాతం ఒపెన్‌ స్థలానికి కేటాయించాలి. ఈ స్థలాన్ని ప్రజోపయోగ కార్య క్రమాలకు వినియోగిస్తారు. వీటితో పాటు అమెనిటీస్‌కు 2 శాతం, యుటిలిటీలకు ఒక శాతం, మొత్తం 43 శాతం స్థానిక సంస్థలకు అప్పగించాలి. కాగా తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ 145 మేరకు మరో 5 శాతం స్థలాన్ని కలిపితే 48 శాతం భూమిని వదులుకోవాలి. భూమిని అప్పగించడంతో పాటు భూ మార్పిడి, లే అవుట్‌ అప్రూవల్‌ రుసుంలు చెల్లించాలి. వీటిన్నింటికి కలుపుకుంటేనే అప్రూవల్‌ దక్కుతుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వీటన్నింటినీ కలుపుకుంటే అనుమతి పొందిన లే అవుట్‌లలో స్థలం కొనాలంటే ధరలు ఆకాశాన్నంటుతాయి.

ఈ నేపథ్యంలో లే అవుట్లలో స్థలం ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా సొంతింటిని నిర్మించుకోవాలని తలిచే మధ్యతరగతి, ఉద్యోగ, ఇతర వర్గాలకు ఇది భారం కానుంది. తమపై పడుతున్న భారంను కొనుగోలుదారులకు బదలాయించడం ద్వార స్థలాలు ధరలు 15 నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నంద్యాల జిల్లా కానున్న తరుణంలో రైతు న గర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు వేశారు. అయితే వీటిలో చాలవరకు అనధికార లే అవుట్లు కావడం గమనార్హం. అలాగే పాణ్యం నియోజక వర్గంలోని ఓర్వకల్లు, హుస్సేనాపురం, కల్లూరు, పాణ్యం, తదితర మండలాల్లో కూడ భారీగా వెంచర్లు వెలిశాయి. వీటిలో కూడా అధిక భాగం అక్రమ వెంచర్లు వెలిశాయి. వాస్తవంగా వీటన్నింటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ప్రతి రెండు, మూడేళ్లకు ఒకమారు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని అమలు చేస్తుంది. వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ధరఖాస్తు చేసుకునే వాటిలో కర్నూలు జిల్లాలో దాదాపు 40 నుంచి 50 లే అవుట్లు అనుమతులు పొందాయి. కాగా అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు వచ్చిన ధరఖాస్తుల సంఖ్య దాదాపు 200కు పైగా ఉండగా, ఇటీవల అధికారులు గుర్తించిన అనధికార లే అవుట్ల సంఖ్య దాదాపు 400 వరకు ఉన్నట్లు సమాచారం. వీటిని పరిశీలిస్తే ఎక్కువగా జిల్లా కేంద్రంలోని కల్లురు, ఓర్వకల్లు, పాణ్యం, నంద్యాల, ఆదోని, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని తదితర మండలాలోనే అధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అయితే వీటిలో చాల వరకు ఇప్పటికే లే అవుట్లలో ప్లాట్లను విక్రయించినట్లు సమాచారం. ఇటువంటి క్రమంలో నూతన నిబంధనలు అమలు చేయడం అధికారులకు కత్తిమీద సామే. తాజా జీఓ జారీ నేపథ్యంలో కొనుగోలు దారులపైనే పెను బారం పడనుంది. జీఓ 145 మేరకు జిల్లా, పట్టణ, గ్రామీణ ప్రణాళిక..ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయన్నారు. ఉత్తర్వుల జారీ అనంతరం అక్రమ లే అవుట్లపై ఇప్పటికే చాల మంది రియల్‌ వ్యాపారులకు, భూ యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు మేరకు 5 శాతం నిబంధన వర్తిస్తుంది. రియల్‌ వ్యాపారులు నోటీసులు సూచించిన మేరకు తమ స్ధిరాస్తులకు చెల్లించాల్సిన పీజులు చెల్లించాలని లేని పక్షంలో ఆయా పాట్లను రిజిస్ట్రేషన్‌శాఖలో నిషేధిత జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement