సినీ నటుడు నందమూరి తారక రత్న కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అత్యంత విషమంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన కన్నుమూశారు.
జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. తారకరత్నకు 23 రోజులుగా అక్కడే చికిత్సను అందిస్తున్నారు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నం మాత్రం ఫలించలేదు.
తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి , ఓ కూతురు ఉన్నారు. ఛాయాగ్రాహకుడు మోహనకృష్ణ తనయుడైన తారకరత్నకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. బాలకృష్ణ ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఒకటో నెం. కుర్రాడు’ చిత్రంతో హీరోగా వెండితెరపైకి రంగప్రవేశం చేశారు. తారకరత్న హీరోగా దాదాపుగా 20 చిత్రాల్లో నటించారు. పలు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించి అలరించారు. ‘అమరావతి’ సినిమా ఆయనకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డును తీసుకొచ్చింది. ఈ చిత్రం 2009లో విడుదలైంది. తారకరత్న 2022లో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు. ‘9 అవర్స్’ వెబ్‌సిరీస్‌లో నటించారు. చివరిగా ‘సారధి’ మూవీలో కనిపించారు.