పత్తికొండ – గత కొన్ని రోజులుగా టమోటా ధర ఠారెత్తించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టమోటా ధర డబుల్, ట్రిబుల్ సెంచరీ కొట్టింది. దీంతో ప్రభుత్వాలు సైతం బెంబేలెత్తిపోయాయి.సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం టమోటా ధర చూసి నోరెళ్లబెట్టారు. ఈ ధరల పెరుగుదల పుణ్యమాని అనేకమంది టమోటా రైతులు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. ఇదంతా నిన్నటి మొన్నటి పరిస్థితి.
ఇపుడు టమోటా ధర ఒక్కసారిగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమోటా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. రైతులు తొలిరోజే సుమారు 10 టన్నుల సరకు మార్కెట్కు తెచ్చారు. వేలంలో క్వింటాలు టమాటాకు రూ.వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది. అంటే.. కిలోకు రూ.10 కూడా దక్కలేదని రైతులు వాపోయారు.
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడం వల్ల ధరలు పతనం అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు.. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు మాత్రం కిలో టమాటాకు రూ.30-40 వరకు వెచ్చించక తప్పడం లేదు. ప్రధాన మార్కెట్లో రైతులకు ఏమాత్రం గిట్టుబాటు లేని ధరకు అమ్ముతుంటే చిల్లర వ్యాపారులు మాత్రం ఇష్టానుసారమైన ధరకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు