రైలు ప్రమాదం ఘటన తనను కలచివేసిందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాణ్యమైన వైద్య సహాయన్ని అందించాలని కోరారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన సంభవించిన కొద్ది నెలల వ్యవధిలో అలాంటి ప్రమాదమే మళ్లీ చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు.
దేశంలో లక్షలాదిమంది తమ ప్రయాణాల కోసం రైల్వేలపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. ప్రజా రవాణాలో అత్యంత కీలకమైన రైల్వేల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవించడం.. ప్రమాద ఘంటికలను సూచిస్తోందని స్టాలిన్ చెప్పారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం.. కాలానుగుణంగా రైల్వే నెట్‌వర్క్ ఆధునికీకరణ, భద్రత చర్యల పెంపుపై నిర్ణయాలను తీసుకోవాలని స్టాలిన్ సూచించారు. మున్ముందు రైలు ప్రమాదాలు జరక్కుండా నివారించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ.. తన భద్రత చర్యలను అత్యవసర పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరింత మెరుగుపర్చుకోవాలని చెప్పారు. తరచూ సంభవించే ప్రమాదాల వల్ల రైల్వే వ్యవస్థపై ప్రయాణికు తమ విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.