Wednesday, November 20, 2024

ఏపీ, ఒడిశా మధ్య చర్చలు.. కొఠియా గ్రామాల్లో ప్రశాంతత..

విజయనగరం, ప్రభ న్యూస్‌: ఏపీ-ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌ ఈనెల 9న భువనేశ్వర్‌లో కలయిక వల్ల దశాబ్ధాల కాలంగా అపరిష్కృతంగా వున్న ఎన్నో సమస్యలకు మోక్షం కలగనుందన్న ఆయా వర్గాల అంచనాలకు తగ్గట్టుగానే కొఠియా గ్రామాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో కాస్త మార్పు కనిపిస్తోన్న పరిస్థితి. ముఖ్యంగా జగన్మోహన్‌రెడ్డి-నవీన్‌ పట్నాయక్‌ భేటీ తర్వాత ఒడిశా ప్రభుత్వం కొఠియా గ్రామాల విషయంగా గతంలో ప్రదర్శించిన దూడుకును గణనీయంగా తగ్గించింది. ఈనెల ఒకటిన సామాజిక భద్రతా పింఛన్లు ఇచ్చేందుకు కొఠియా, గంజాయిభద్ర, ఎగువ శంబి వెళ్లిన సచివాలయ సిబ్బందిని అడ్డుకున్న వైనం తెలిసిందే. ఆ క్రమంలో 2న సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వున్న మైదాన ప్రాంతం నేరెళ్లవలసలో వున్న గంజాయిభద్ర సచివాలయానికి వచ్చి పింఛన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఆయా గ్రామాలవారికి అనివార్యమైన సంగతి విదితమే.

అదే విధంగా గత నెల చోటుచేసుకున్న పరిణామాల్లోకి వెళ్తే.. అక్టోబర్‌ 22న వెలుగు(వైఎస్‌ఆర్‌ క్రాంతి పదం) సిబ్బందిని, అక్టోబర్‌ 23న వైద్య సిబ్బందిని, అక్టోబర్‌ 26న ఉపాధిహామీ పథకం సిబ్బందిని అడ్డుకున్న వైనం తెలిసిందే. అటువంటిది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయిన తర్వాత ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అంత వరకు ఎగువ శంబి గ్రామం వద్ద కాపాలాగా వున్న ఒడిశా పోలీసులు ఆపైన అక్కడ నుంచి వెనుదిరిగిన పరిస్థితి. ఫలితంగా కొఠియా గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏపీ, ఒడిశా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల కమిటీ చర్చలు, తదనంతర పరిణామాలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement