Tuesday, November 26, 2024

భూ మాయలో తహసీల్దార్లే సూత్రధారులు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రెవెన్యూ శాఖ పరిధిలో జరుగు తున్న భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను అవలంభిస్తున్నా మరోవైపు అదే శాఖలోని కొంతమంది అధికారులు భూ ఆక్రమణదారులతో చేతులు కలిపి ప్రభుత్వ భూములకే కన్నం వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తహసీల్దార్‌ స్థాయిలో ఉన్న అధికారులే ఇంటి దొంగలుగా మారి ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో కూడా రాష్ట్ర స్థాయి అధికారులు తెలుసుకోలేక పోతున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములు మాయమ వుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జలాశయాలు, రిజర్వాయర్లు, భారీ ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ పక్రియలో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోమశిల ప్రాజెక్టు నుంచి పోలవరం జలాశయం భూసేకరణకు సంబం ధించి వరకు కూడా అనేక ప్రాంతాల్లో అవకతవకలు చోటుచేసుకు న్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తం గా పలువురు రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉప క్రమిస్తున్నా..మరోవైపు నూతనంగా ఏర్పాటు కాబోతున్న బ్యాలె న్సింగ్‌ రిజర్వాయర్ల పరిధిని భూసేకరణలోనూ స్థానిక రెవెన్యూ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ భూ మాయాజాలానికి పాల్పడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వ భూములకే పరిహారం అందిస్తూ ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని మోపడంతో పాటు ప్రభుత్వ పరిధిలో ఉన్న విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులను హక్కు దారులుగా చేసి వారికి ప్రభుత్వ భూములను దారాదత్తం చేస్తు న్నారు. ఈ తరహా భూ మాయ రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని ఏదోఒక ప్రాంతంలో తంతుగా జరుగుతూనే ఉంది. కొన్నింటిపై ఫిర్యాదు వెళ్తున్నప్పటికీ విచారణ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అసలు నిజాలు మరుగున పడిపోతున్నాయి.

పోలవరం, కండలేరు, సోమశిల ముంపులోనూ..అనేక అక్రమాలు
పోలవరం, సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో భూసేక రణకు సంబంధించి గతంలో అనేక అక్రమాలు జరిగినట్లు విమ ర్శలు వినిపిస్తున్నాయి. భూసేకరణ సందర్భంలోనే రెవెన్యూ అధికారులు కొంతమంది స్థానికులతో చేతులు కలిపి పరిహారం సొమ్మును పక్కదారి పట్టించేందుకు పక్కా పథకం వేశారు. బీడు భూముల్లో పంటలు సాగుచేసినట్లుగా రికార్డుల్లో చూపించి ఆ భూములకు పరిహారాన్ని పెంచారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఉద్యాన పంటలు సాగుచేసినట్లుగా చూపించి లేని పండ్ల చెట్లు ఉన్నట్లుగా చూపించి పెద్దఎత్తున పరిహారాన్ని దోచుకున్నారు. సోమశిలకు ఎగువున ఉన్న కడప జిల్లా పరిధిలోని రాజంపేట, జూలపల్లి, భాయ్‌గారితోట తదితర ప్రాంతాల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. అలాగే సోమశిలకు అనుసందానంగా నిర్మించిన కండలేరు జలాశయం పరిధిలో కూడా రాపూరు, కలువాయి, చేజర్ల మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో భూములతో పాటు ఇళ్లకు అందించే పరిహారంలోనూ చేతివాటాన్ని ప్రదర్శించారు. అసలు ముంపుతో సంబంధం లేని వారు ముంపు గ్రామాల్లో ఉన్నట్లుగా వారి పేరు మీద ప్రభుత్వ భూములను సొంత భూములుగా చూ పించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఫలితంగానే సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో నేటికి కొన్ని ప్రాం తాలకు పూర్తి స్థా యిలో పరిహారం అందలేదు. ఈ వ్యవహారంలో నిజమైన బాధి తులు నేటికి పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అలాగే శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని సోమశిల హైలెవల్‌ కెనాల్‌ భూసేకరణకు సంబంధించి కూడా మర్రిపాడు మండల పరిధిలో కొన్ని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద చూపించి పరిహారాన్ని సొంత ఖాతాలకు మళ్లించే ప్రయత్నం కూడా పెద్దఎత్తున జరిగినట్లు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పోలవరం భూసేకరణలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. పై ప్రాంతాల్లో భూసేకరణ, అందుకు సంబంధించిన పరిహారం చెల్లింపులో క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

చౌటపల్లి వ్యవహారంలో ముగ్గురు తహసీల్దార్లపై వేటు
చౌటపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ భూసేకరణతో పాటు కలువాయి మండ లంలో పలు ప్రాంతాల్లో భూముల పంపిణీకి సంబంధించి భారీ అక్రమాలు జరిగాయని ‘ఆంధప్రభ’ ఇటీవల వరుస కథనాలను ప్రచురించింది. వాటిపై స్పం దించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో కలువాయిలో గతంలో తహశీల్దార్లుగా పనిచేసిన నాగరాజు, హమీద్‌, లావణ్యలపై జిల్లా కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. చౌటపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ భూములకు సంబంధించి జరిగిన అవకతవకల్లో వీరి పాత్ర ఉందని విచారణలో తేలింది. దీంతో వారిపై చర్యలు తీసుకున్నారు. కలువాయి మండల పరిధిలో 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక్క మండలంలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్లో అక్రమాలు జరిగాయంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏ స్థాయిలో భూ దోపిడీ జరిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

చౌటపల్లిలో డొంక కదిలిందిలా..
చౌటపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పరిధిలో ముంపు పరిహా రానికి సంబంధించి భారీ అక్రమాలు చోటుచేసుకొన్నాయి. ముంపు పరిహారాన్ని పక్కదారి పట్టించడంలో అక్రమార్కులకు సహక రించిన ఓ రెవెన్యూ అధికారికి భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పడంతో పాటు ఖరీదైన కియా కారును కానుకగా సమర్పించినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. గుట్టుచప్పుడు కాకుండా దోపిడీ జరిగిన భూ పరిహారానికి సంబంధించి తీగ లాగితే డొంక ఇలా కదిలింది. కండలేరు జలాశయం పరిధిలో ముంపునకు గురయ్యే గ్రామాలకు పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి రాపూరు, కలువాయి, చేజర్ల మండలాల పరిధిలోని ముంపునకు గురయ్యే గ్రామాలకు గత దశాబ్ద కాలంగా దశల వారీగా పొలాలకు, ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం కలువాయి మండల పరిధిలోని పెరమకొండ గ్రామానికి సంబంధించి సుమారు 246 మంది లబ్దిదారులకు సంబంధించి ముంపునకు గురయ్యే నివాసాలకు సుమారు రూ.56 కోట్లు పరిహారం చెల్లించారు. అలాగే మరో రూ.36 కోట్లు కూడా లబ్దిదారులకు గతంలో పెండింగ్‌ ఉన్న పరిహారాన్ని అందించారు. అయితే ఈ పరిహారం చెల్లింపులో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కలువాయి మండలంలోని చౌటపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు సంబంధించి 100 ఎకరాల భూముల పరిహారంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. గతంలో పరిహారం చెల్లించిన పొలాలకే తిరిగి కొత్తగా పట్టాలు సృష్టించి సర్వే నెంబర్లు మార్పు చేసి పరిహారాన్ని బొక్కేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో 30 ఎకరాలకు సంబంధించి సుమారు రూ.2 కోట్ల పరిహారం పక్కదారి పట్టించడంతో పాటు మరికొన్ని ప్రభుత్వ భూములకు పరిహారాన్ని అందించేలా రికార్డులు నమోదు చేసినట్లు గుర్తించారు. దీంతో రెవెన్యూ అధికారుల అక్రమాలు తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది.

క్షేత్రస్థాయిలో విచారిస్తే.. వెలుగులోకి కుంభకోణాలు
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, జలాశయాల నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న భూసేకరణ పక్రియలో కొంతమంది రెవెన్యూ అధికారులు వ్యవస్థలో ఉన్న కొన్ని విధానాలను తమకు అనుకూలంగా మలచుకుని అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. పోలవరం నుంచి సోమశిల వరకు వివిధ ప్రాజెక్టుల భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశిస్తున్నప్పటికీ అదే ప్రాంతానికి చెందిన అధికారులను విచారణ అధికారులుగా నియమిస్తుండడంతో వారు స్థానిక అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వానికి సైతం తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న భూ కుంభకోణాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడం లేదు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా స్పందించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణకు సంబంధించిన పక్రియపై రహస్య విచారణ చేపడితే మరిన్ని కుంభకోణాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement