Friday, November 22, 2024

Followup : రేపు విశాఖలో టీ-20 క్రికెట్‌ పండుగ.. ఉత్కంఠగా మారిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య రసవత్తరంగా సాగుతున్న టీ 20 సిరీస్‌ మరింత ఉత్కంఠగా మారింది. తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి మూడో మ్యాచ్‌పై కన్నేసిన దక్షిణాఫ్రికా ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అయితే సెంట్‌మెంట్‌గా కలిసివచ్చిన విశాఖ వేదికపై మూడో టీ 20 మ్యాచ్‌ను చేజిక్కించుకుని సిరీస్‌పై పట్టు పెంచేందుకు భారత్‌ జట్టు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. దీంతో ఇరుజట్లు పూర్తిస్థాయిలో తమ బలాబలాలు ప్రదర్శించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా రేపు (14న) జరగనున్న మూడో మ్యాచ్‌ లో పాల్గొనేందుకు భారత్‌ – సౌతాఫ్రికా జట్లు- సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నాయి. అక్కడి నుంచి నేరుగా సాగర్‌నగర్‌లో ఉన్న రాడిషన్‌ బ్లూ హోటల్‌కు ఇరు జట్ల క్రికెటర్లు చేరుకొని బసచేశారు. మంగళవారం ఉదయం ఇరు జట్లు- ప్రాక్టీస్‌ చేయనున్నాయి. క్రికెటర్లను చూసేందుకు విశాఖ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున క్రీడాభిమానులు తరలివచ్చారు. ఎటు వంటి భద్రత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మ్యాచ్‌ నిర్వాహకులు, పోలీసులు తగు ఏర్పాట్లు చేశారు. పోలీస్‌ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల ద్వారా ఎయిర్‌పోర్టు నుంచి క్రికెటర్లను హోటల్‌కి తరలించారు.

కలిసివచ్చిన స్టేడియం..

విశాఖ ఏసీఏ, వీడీసీఏ స్టేడియం భారత్‌ జట్టుకు సెంట్‌మెంట్‌గా పూర్తి స్థాయిలో కలిసివచ్చే వేదిక. ఇక్కడ జరిగిన వన్‌డేలు, టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక శాతం భారత జట్టే చేజిక్కించుకుంది. అయితే రెండు టీ 20 మ్యాచ్‌లు వరుసుగా ఓటమి చెందడంతో భారత్‌పై ఈ మ్యాచ్‌ మరింత ఒత్తిడి తెచ్చింది. సిరీస్‌ను దక్కించుకోవాలని దక్షిణాఫ్రికా, ఈ మ్యాచ్‌లో విజయం చేజిక్కించుకుని రేసులో కొనసాగేందుకు భారత్‌ ప్రయత్నాలు చేస్తున్నాయి. సెంటిమెంట్‌ పరంగా కలిసి వచ్చే అవకాశం ఉండటంతో సౌత్‌ఆఫ్రికాపై ఖచ్చితంగా భారత్‌ గెలుస్తుందనే ధీమాతో అభిమానులు ఉన్నారు. మ్యాచ్‌ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement