కర్నూలు జిల్లాలో నెలకొన్న మంత్రాలయ క్షేత్రం ఎంతో మహిమ కలిగినదని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఆదివారం మంత్రాలయంలో ఒక ప్రైవేటు అతిథి గృహానికి మంత్రాలయ పీఠాధిపతితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం టీజీ మాట్లాడుతూ రాఘవేంద్ర స్వామి తపస్సు ఆచరిస్తూ సజీవ సమాధి కావడం, ఆయన సమాధిని బృందావనంగా మనం కోలుస్తున్నామని అన్నారు. ఎంతోమంది కర్ణాటక, తమిళనాడు భక్తులు మంత్రాలయ రాఘవేంద్ర స్వామినీ దర్శించుకుని ఆయన కృపకు పాత్రులవుతున్నారని టిజీ అన్నారు. మంత్రాలయానికి గతంలో భక్తుల రాక తక్కువగా ఉండేదని, ప్రస్తుతం భక్తుల రద్దీ బాగా పెరిగిందని అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు తగిన సౌకర్యాలు చేయడంలో, మంత్రాలయ మఠం యాజమాన్యం ప్రస్తుత పీఠాధిపతి ఆధ్వర్యంలో ముందంజలో ఉందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, మంత్రాలయ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి పీఠాధిపతి గారు ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు.
దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకొని వారి అవసరాలను తీర్చేందుకు , ప్రైవేట్ అతిథి గృహాలు క్షేత్రంలో నెలకొల్పడం ఎంతో అభినందించదగ్గ విషయమని టిజి వెంకటేష్ అన్నారు. అతిథి గృహం శంకుస్థాపన అనంతరం టీజీ వెంకటేష్ దంపతులు మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు
. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బిటి నాయుడు, తిక్కారెడ్డి, బిజెపి నాయకులు పురుషోత్తం రెడ్డి, విట్ట రమేష్, మురహరి రెడ్డి, జైశ్రీరామ్ ఫౌండేషన్ నాయకులు శ్రీధర్, రాము ఆర్యవైశ్య సంఘం నాయకులు జయంతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.