ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసుపై ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్ జిల్లా వైకాపా అధ్యక్షుడు పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు.. హత్య కేసుపై మాట్లాడవద్దని ఏప్రిల్ 16న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిగింది.
కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని ఆక్షేపించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది.