అమరావతి, ఆంధ్రప్రభ : రాయలసీమలో అత్యధికంగా పండించే అరటి దిగుబడి, ఎగుమతులకు జాతీయ ఉద్యానబోర్డు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనుంది. డాక్టర్ వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అరటి సాగును క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ) పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్ల్రోని 12 ప్రాంతాలను సీడీపి పరిధిలోకి తీసుకురాగా..దీనిలో రాష్ట్రంలోని రాయలసీమ అరటి సాగుకు కూడా చోటు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మూడేళ్లపాటు అమలు చేసే ప్రాజెక్టు కోసం రూ.269.95 కోట్లతో జాతీయ ఉద్యానబోర్డు ప్రణాళిక రూపొందించింది. మూడు జిల్లాల పరిధిలో గుర్తించిన 42,500 ఎకరాలను సీడీపీ కోసం ఎంపిక చేశారు. దిగుబడుల పెంపుదల, నాణ్యత, విదేశీ ఎగుమతులు లక్ష్యంగా సీడీపీని అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం జాతీయ ఉద్యాన బోర్డు రూ 100 కోట్లను గ్రాంట్ రూపంలో అందించనుంది. మిగిలిన మొత్తాన్ని పబ్లిక్ ప్రయివేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) కింద సమీకరించనున్నారు. ప్రాజెక్టులో భాగంగా సాగుదశలో విత్తనం నాటే దశ నుంచి కోత నిర్వహణ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్ మెట్, వాల్యూ ఎడిషన్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ తదితర అనేక దశల్లో శిక్షణ, ఆర్ధిక సహకారాన్ని బోర్డు అందిస్తోంది.
లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పనకు రూ.78.70 కోట్లు, ప్రీ ప్రొడక్షన్ – ప్రొడక్షన్కు రూ.116.50 కోట్లు, పోస్ట్హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యూఎడిషన్ కోసం రూ.74.75కోట్లను వ్యయం చేయనున్నారు. రూ 6.5 కోట్ల వ్యయంతో మల్టీమోడల్ ట్రాన్స్ పోర్టు పరికరాలు, రూరల్, డైరెక్ట్ మార్కెట్స్, కలెక్షన్ సెంటర్స్, టెస్టింగ్ ల్యాబ్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్, ప్రీ కూలింగ్ యూనిట్స్, మొబైల్ ప్యాకింగ్ యూనిట్లు, గెలల రవాణా కోసం కన్వే బెల్టులు, రిఫ్రిజరేటెడ్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్, నర్సరీలు, టిష్యూ కల్చర్ ల్యాబ్స్, సాయిల్ లీఫ్, ఎంఆర్ ఎల్, ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాల మేరకు అరటి నిల్వలు, ప్యాకేజీల కోసం రెండు ప్యాక్ హౌస్ లు, రెండు కోల్డ్ స్టోరేజీలు అనంతపురంలో ఉండగా, పులివెందులో మరో ప్యాక్ హౌస్ నిర్మాణదశలో ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..