ఆంధ్రప్రదేశ్‌లో మూకుమ్మడిగా రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారానికి ఏపీ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న సచివాలయంలోని అసెంబ్లీ పార్కింగ్ స్థలంలో ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు ఫొటో సెషన్, వేదిక, అలంకరణ వంటి వాటిపై సూచనలు చేశారు.
అదేవిధంగా ఆహ్వాన పత్రిక, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారికి ఆహ్వానం పలకడం, రవాణా సౌకర్యం ఏర్పాట్లను ప్రోటోకాల్ విభాగం పర్యవేక్షిస్తోంది. ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రివర్గంలో ఉన్న మొత్తం 24 మంది మంత్రులు నిన్న తమ రాజీనామా పత్రాలను అందజేశారు. పాత మంత్రివర్గంలో ఉన్న వారిలో అయిదుగురు లేదా ఆరుగురిని కుల, మత, ప్రాంతీయ సమీకరణల మేరకు కొనసాగిస్తారని భావించినప్పటికీ అనుభవం దృష్ట్యా మరికొంత మందికి తిరిగి అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న మంత్రివర్గంలో అధికభాగం కొత్తవారికి చాన్స్ ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.