( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) ఏపీ సీఎం 4.0 గా నారా చంద్రబాబు నాయుడు పట్టాభిషేకం కార్యక్రమం తెలుగు తమ్ముళ్లను అలరించింది. తెలుగుదేశం పార్టీ సీనియర్లకు మళ్లీ 41 ఏళ్ల కిందటి దృశ్యం గుర్తుకు వచ్చింది. హైదరాబాద్ లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నేతృత్వంలో 15 మంది నవ నాయకులు మంత్రులుగా ప్రమాణం చేస్తే… ఆరోజున ఎన్డీఆర్ అభిమానులు చిందులేశారు. పరవళ్లు తొక్కారు. ఇక గన్నవరం మండలం కేసరపల్లిలో నారా చంద్రబాబు నాయుడితో సీఎంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా నాలుగో సారి సీఎం ప్రమాణం చేస్తూ.. . చంద్రబాబు నాయుడు అనే నేను.. అని అనగానే సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. .ఈ సందర్భంగా.. చంద్రబాబు ప్రమాణం చేస్తూ.. ఏపీ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగంపట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో..నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, నాకు తెలియవచ్చిన కర్తవ్యాలను నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ఆ విషయాలను ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు.
ప్రమాణ స్వీకారానికి ముందు.. పోలీస్ యంత్రాంగమంతా జనగణమన గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, నాగబాబు, సాయి ధరమ్ తేజ్, నందమూరి ఫ్యామిలీ, సూపర్ స్టార్ రజనీకాంత్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. .
కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను…
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం.. పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో.. నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, నాకు తెలియవచ్చిన కర్తవ్యాలను నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ఆ విషయాలను ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. అనంతరం తన అన్న, మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు.
నయా మంత్రుల ప్రమాణం
నారా లోకేష్ సహా.. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, మొహమ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్. సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం మరోసారి పోలీస్ యంత్రాంగం జాతీయ గీతాన్ని ఆలపించగా ప్రధాని నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు తమలోతాము జాతీయ గీతాలాపనలో గొంతు కలిపారు.
మోదీ ఆత్మీయ ఆలింగనం…
ఆ సంగతులు అలా ఉంచితే.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం టీడీపీ అభిమానుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. . సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. వేదికపై ఉన్న నరేంద్ర మోదీ పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాదాభివందనం చేయబోగా.. అందుకు మోదీ నిలువరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సభా ప్రాంగణంలోని జనాలు ఈ దృశ్యం చూసి.. ఈలలు, కేకలతో హోరెత్తించారు. దీంతో.. ఆ కొన్ని క్షణాల పాటు ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. అనంతరం చంద్రబాబు వేదికపై ఉన్న ఇతర అతిథులను నమస్కరించారు.
మెగా పవర్ మధ్య అభివాదం
మంత్రుల ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత సభా వేదికనుంచి దిగిపోయే సమయంలో,,. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని ప్రధాన వేదికకు పక్కన అతిథులు కూర్చున్న మోదీ చేరుకుని.. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్.. ఉండగా మధ్యలో మోదీ నిల్చుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే సభికులంతా మెగస్టార్.. పవర్ స్టార్ నినాదాలు చేశారు. అంతేకాదు మెగస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి అయ్యారు. పవన్ కళ్యాణ్ గడ్డం పట్టుకుని నవ్వుతూ చిరంజీవి పలకరించారు. దీనిని మెగస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.
పవర్ స్టార్…కోరిక తీరే ..
మరి కొన్ని గంటల్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవర్ స్టార్ కలను ఎట్టకేలకు ఏపీ జనం నెరవేర్చారు. అసలు ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని రెచ్చగొట్టినోళ్లందరికీ సమాధానం ఇస్తూ…. ఏకంగా డిప్యూటీ సీఎంగానే అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టబోతున్నారు. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే. 70 వేలకు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు. ఇంత మెజారిటీ అంటే మాటలు కాదు. పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. తను మాత్రమే కాదు.. తన పార్టీ తరుఫున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించుకున్నారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న పవన్‌ను ఏపీ ప్రజలు పూర్తిగా నమ్మారు.