టెక్స్టైల్ పార్కుల అభివృద్ధితో పెద్ద ఎత్తున ఉపాధి సృష్టి జరుగుతుందని.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు సుస్థిర జీవనోపాధి లభిస్తుందని కలెక్టర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ హరికిరణ్.. నేతాజీ అపెరల్ పార్కు (తిరుపూర్, తమిళనాడు) డైరెక్టర్ రవిచంద్రన్, సీఈవో సుబ్రమణియన్‌తో వికాస ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. జిల్లాలో టెక్స్టైల్ పార్కుల అభివృద్ధి, పెట్టుబడిదారులు, మౌలిక వసతుల కల్పన, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు, ఉపాధి కల్పన తదితరాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పారిశ్రామిక, అపెరల్ విధానాలు, ప్రయోజనాలపై సమావేశంలో చర్చించారు.
నేతాజీ అపెరల్ పార్కు (ఎన్ఏపీ)తో ప్రస్తుతం తిరుపూర్ దేశంలో ఉత్తమ నిట్వేర్ ఉత్పత్తి కేంద్రంగా మారిందని ఎన్ఏపీ డైరెక్టర్, సీఈవో.. కలెక్టర్‌కు వివరించారు. టెక్స్టైల్ రంగంలో పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), స్థానిక పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉపాధి కల్పనకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ మెగా టెక్స్టైల్ పథకాన్ని ప్రకటించిందని.. రూ.500 కోట్ల ప్రాజెక్టును జిల్లాకు తీసుకొచ్చేందుకు ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టుతో ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని.. ఇది స్థానిక పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందన్నారు.
సమావేశంలో కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఆయిల్, గ్యాస్ రంగంలోనే కాకుండా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తోందని.. జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు అనువైన వనరులు, వాతావరణం ఇక్కడ ఉందన్నారు. టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుతో ముఖ్యంగా స్పిన్నింగ్ నుంచి ఫినిషింగ్ వరకు కార్యకలాపాలకు కేంద్రంగా ఉండే మెగా టెక్స్టైల్ పార్కుల వల్ల పెద్ద ఎత్తున ఉపాధి సృష్టి జరుగుతుందని.. ప్రధానంగా గ్రామీణ మహిళల సాధికారతకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
జిల్లాను టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి సంబంధించి నేతాజీ అపెరల్ పార్కు ప్రతినిధుల సమావేశం ముందుంచిన ప్రతిపాదనలను పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. పార్కు ఏర్పాటుకు అవసరమైన భూమి, ఇతర సదుపాయాలు, వ్యక్తిగత మైక్రోయూనిట్లు, క్లస్టర్ల ఏర్పాటు అంశాలను క్షుణ్నంగా పరిశీలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో వికాస పీడీ కె.లచ్చారావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సుధాకర్, జిల్లా పారిశ్రామిక కేంద్రం జీఎం బి.శ్రీనివాసరావు, వేదాంత లిమిటెడ్ ప్రతినిధి వి.సతీష్ తదితరులు పాల్గొన్నారు.