Friday, November 22, 2024

అనుమానాస్పదంగా పెద్దపులి మృతి.. బ‌య‌ట‌కు పొక్క‌కుండా సీక్రెట్‌గా ఖ‌న‌నం

ఆత్మకూరు, (నంద్యాల) ప్రభన్యూస్‌ : ఆత్మకూరు మండలం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ మూడవ గేటు పైన చిరుత పులి నక్కి ఒక రోజంతా అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది.. 24 గంటలు గడవకముందే పెద్ద పులులు సహజ ఆవాసమైన నంద్యాల జిల్లా ఆత్మకూర్‌ అటవీ డివిజన్‌ నల్లమలలో ఓ పెద్దపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పులి మృతికి కారణమేంటో అధికారులకు సైతం తెలియడం లేదు. సాయంత్రం చీకటి పడే సమయానికి సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు బైర్లూటి రేంజ్‌ పెద్ద అనంతపురం సెక్షన్‌లోకి ప్రవేశించారు. అప్పటికే అటవీశాఖ ప్రత్యేకంగా నియమించిన స్నిఫర్‌ డాగ్‌ బృందాలతో గాలించి పెద్దపులిని డెడ్‌బాడీని కనుగొన్నారు. నిన్నటి చిరుతపులి ఘటనతో కంగారుపడ్డ అటవీశాఖ అధికారులు ఈ పెద్దపులి మృతిని మాత్రం బ‌య‌ట‌కు పొక్క‌కుండా దాచి ఉంచారు.

పెద్దపులి మృతి ఘటనపై సమాచారం కోసం అధికారులను మీడియా సంప్రదించే ప్రయత్నం చేయగా, ముందస్తుగా తమ ఫోన్లను స్విచ్‌ఆఫ్‌ చేసి జాగ్రత్త పడ్డారు. నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత ఆత్మకూరు డివిజన్‌లో మొదటిసారిగా ఓ పెద్దపులి అనుమానాస్పదంగా మృతి అటవీశాఖ అధికారుల రికార్డుల్లో నమోదయింది. ఐదేళ్లుగా ఆత్మకూర్‌ అటవీ డివిజన్‌ లో సుమారు ఐదారు పెద్ద పులులు అనుమానాస్పదంగా చనిపోయాయి. ఒకవైపు పెద్ద పులుల సంఖ్య పెరుగుతూ ఉంటే మరోవైపు అదే రీతిలో పులులు, చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. చనిపోతున్న పెద్దపులుల ఘటనలకు కారణాలేమిటో అటవీశాఖ అధికారులు వెల్లడిం చడం లేదు. ఉన్నత అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ తమ ఉద్యోగాలను రక్షించుకుంటూ అభయారణ్యంలోని పెద్దపులులను సంరక్షించ లేకపోతున్నారని వన్యప్రాణి ప్రేమికులు విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement