తిరుపతి, ప్రభన్యూస్ బ్యూరో: పోలీస్‌స్టేషన్‌కు సాయం కోరి వచ్చే ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసు అధికారులే డబ్బుకోసం కక్కుర్తి పడటంతో ఓ సిఐ, ముగ్గురు ఎస్‌ఐలను సస్పెండ్ చేసిన సంఘటన తిరుపతి జిల్లా శ్రీపద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులే అవినీతి, అక్రమాలకు, భూకబ్జాలకు, సెటిల్‌మెంట్లకు అధికార పార్టీ నేతలకు భజన పలుకుతున్న పోలీసు అధికారులకు తగిన శాస్తి జరిగిందని జిల్లా వాసులు చెబుతున్నారు. లంచం తీసుకోవడమే కాకుండా దోషులకు సహకరించిన నేరంపై నలుగురిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఉత్తర్వులలో పేర్కొన్నారు.
తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్కా, పాన్ మసాలాలు, 20 లక్షల రూపాయల విలువచేసే సిగరెట్లను నిల్వ వుంచిన గోడౌన్‌లోని సరుకును అమ్ముకోవడానికి సహకరించారన్న ఆరోపణలతో పూర్తి స్థాయి విచారణ చేసి సిఐ ఎం సుబ్రమణ్యం, ఎస్‌ఐలు వీరేష్, బి రామకృష్ణారెడ్డి, రామకృష్ణలను సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసపురం పంచాయతీలో రెండతస్థుల భవనం హైదరాబాద్‌కు చెందిన డిజి నిషాంత్ ఓనరు. ఆ భవనాన్ని తమిళనాడుకు చెందిన ముత్తుకుమార్‌కు అద్దెకిచ్చారు. ఆ భవనంలో ఐటిసి కంపెనీకి చెందిన సిగరెట్ ప్యాకెట్లు, గుట్కా, పాన్ మసాలాలు అందులో పెట్టి వ్యాపారం కొనసాగిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో భవన యజమాని నిషాంత్ భవనాన్ని ఖాళీ చేయమని పలుమార్లు చెప్పాడు.
ఎట్టకేలకు తన సొంతం చేసుకోవాలనుకున్న ముత్తుకుమార్ లా మూడో సంవత్సరం చదువుతున్న బైరాగిపట్టెడకు చెందిన మణికంఠను ఆశ్రయించారు. ఎలాగైనా తనకు ఆభవనం కొనివ్వాలని ముత్తుకుమార్ మణికంఠను పట్టుబట్టారు. మణికంఠ అప్పటికే ఇలాంటి మోసాలకు పాల్పడటంలో ఆరితేరడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవాడు. ఈ నేపథ్యంలో తనకు భవనం కొనుగోలు చేయిస్తే పెద్దమొత్తంలో కమిషన్ ఇస్తానని మణికంఠకు ముత్తుకుమార్ ఆశపెట్టాడు. దీంతో నిషాంత్ మాటలకు లోబడి శ్రీనివాసపురంలోని నిషాంత్ భవనాన్ని డాక్టర్ రెహమాన్‌కు అమ్మి రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ తతంగం అంతా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిపోయింది. విషయం తెలియని ఇంటిఓనర్ నిషాంత్ భవనాన్ని ఖాళీ చేయాలని ముత్తుకుమార్‌ను కోరాడు.
తాను ఈ ఇంటిని కొనుగోలు చేశానని, తనవద్ద పత్రాలుండాయంటూ భవన యజమానిపై అడ్డుతిరిగాడు. దీంతో భవన యజమాని హోల్‌సేల్ ఏజంట్ ముత్తుకుమార్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వెంటనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ మణికంఠ స్థానికంగా ఉంటున్న మంగళంకు చెందిన ఇర్ఫాన్, శ్రీనివాస్ అనే వ్యక్తులకు మణికంఠ కొంత డబ్బు అప్పచెప్పి మరికొంతమంది రౌడీలను పోగేసుకుని భవనం ఖాలీ చేయించడానికి అక్కడకు చేరుకుని దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. ఆ సమయంలో సుమారు 20 లక్షల రూపాయల విలువచేసే సిగరెట్ ప్యాకెట్లు అక్కడ ఉండటాన్ని గమనించి తిరుచానూరు ఎస్‌ఐ వీరేష్‌తో చేతులు కలిపి కొంతడబ్బు ఎస్‌ఐకి ముట్టచెప్పి సిగరెట్ ప్యాకెట్లను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సిఐతో పాటు మరో ఇద్దరు ఎస్‌ఐలు కూడా వాటాలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని మణికంఠ, ఇర్ఫాన్, శ్రీనివాసులు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఐటిసి కంపెనీ మేనేజర్ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై పుత్తూరు డిఎస్పిని విచారణాధికారిగా నియమించారు. ఆయన పోలీసులని కూడా చూడకుండా నిష్పక్షపాతంగా విచారణ చేశారు. ఈ విచారణలో సిఐ సుబ్రమణ్యంతో పాటు మరో ముగ్గురు ఎస్‌ఐలు అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో మణికంఠ, ఇర్ఫాన్, శ్రీనివాస్‌లతో పాటు స్థానికంగా ఉన్న రౌడీలకు వత్తాసు పలికిన సిఐ, ముగ్గురు ఎస్‌ఐలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటనతో తిరుపతి జిల్లాలోని ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఒకింత భయాందోళనలకు గురయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.