Saturday, November 9, 2024

AP: ఏపీ అసెంబ్లీలో.. 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి గురువారం 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మరో వైపు ఈ సమావేశాలు ముగిసే వరకు టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారు. బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తొడగొట్టి కౌంటరిచ్చారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పోటా పోటీగా నిరసనలకు దిగారు. దీంతో సభను స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్, పయ్యావుల కేశవ్.. వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అదే సమయంలో నందమూరి బాలకృష్ణకు మాత్రం ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో తొడగొట్టడం, మీసం మెలేయడం సరైన సంప్రదాయం కాదని అన్నారు స్పీకర్. అలాంటి చర్యలకు పాల్పడినందుకు బాలకృష్ణకు మొదటి హెచ్చరిక జారీ చేశారు. మిగతా సభ్యులపై కూడా అధికార పక్షం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరడంతో.. వారిని కూడా ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా టీడీపీ సభ్యులందర్నీ సభ నుంచి బయటకు పంపించి వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement