Monday, November 25, 2024

AP | సోషల్ మీడియాపై నిఘా : హోమ్ మంత్రి అనిత

తిరుపతి, ఆంధ్రప్రభ (రాయలసీమ బ్యూరో) : అదుపు తప్పే సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టేందుకు ప్రతి జిల్లాలో సైబర్‌ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సెమినార్ హాల్‌లో ఈరోజు సాయంత్రం తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీస్ అధికారులతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర శాంతి భద్రతల ఐజి సిహెచ్. శ్రీకాంత్, అనంతపురం రేంజ్ డీఐజీ డా.షేముషి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు పాల్గొని… శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్ర‌స్తుతం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న విధివిధానాలను మంత్రికి వివరించారు.

అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ… పోలీసుల పనితీరు భవిష్యత్ వ్యూహాలు కార్యాచరణ నేరాల నియంత్రణ, సమర్థవంతమైన పోలీసింగ్ ముఖ్య లక్ష్యమని అన్నారు. పోలీసు శాఖలో సాంకేతికతను ఇనుమడింపజేసి స్మార్ట్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తామన్నారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమర్థవంతంగా పని చేయాలని అధికారులకు సూచించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా పెంచేందుకు ప్రతి జిల్లాలో సైబర్‌ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామన్నారు.

అత్యాధునిక సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని.. వీటి ద్వారా దేవాలయాలు, ఆసుపత్రులు, మసీదులు, పాఠశాలలు, కళాశాలలు మొదలగు చోట్ల ఏర్పాటు చేస్తూ నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. చెక్‌పోస్టుల వద్ద డ్రోన్‌లు, సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచి గంజాయి, ఇసుక, ఎర్రచందనం తదితర అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సబ్ డివిజన్ కు మౌలిక వసతులతో కూడిన నైట్ విజన్ డ్రోన్ లను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.

- Advertisement -

నేర నియంత్రణ చేయడంలో గాని.. మహిళలు, పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల గాని, హత్యలు ఆత్మహత్యలు ప్రేరేపించే వారి పట్ల కఠినంగా వ్యవహరించి..వారు నేరం చేయాలంటే భయపడే విధంగా క్రియాశీలకంగా సమర్థవంతంగా పనిచేసే విధంగా రూపొందించే కార్యాచరణ పై చర్చించామని మంత్రి అనిత తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement