(విజయవాడ సీటి – ప్రభన్యూస్ ప్రతినిధి) : విజయవాడ సిటీలో డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణాపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పేర్కొన్నారు. సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ కి డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటీవల గుజరాత్‌లో పట్టుబడిన డ్రగ్స్‌కు సంబందించి చిరునామాలకే విజయవాడ పరమితమైందని, మొత్తం వ్యవహారం అంతా ఢిల్లి కేంద్రంగా జరిగినట్లు చెప్పారు.
అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్‌ఫోర్సుమెంట్ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టినట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఏర్పాడే దుష్ప్రభావాలపై విద్యార్థులలో చైతన్యం తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున నగరంలో కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. యాక్టివ్ గా ఉన్న 18 మంది రౌడీ షీటర్స్ ని నగర బహిష్కరించామన్నారు.అలాగే కొత్తగా 116 మంది షీట్స్ తెరిచామని, తరచుగా వారికి కౌన్సిలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 3 వేల మంది పై సస్పెక్ట్ షీట్స్ పెట్టి అరెస్ట్ చేసి మండల మెజిస్ట్రేట్ర్ ముందు హాజరుపరిచినట్లు చెప్పారు.
గుట్కా, గంజాయి,మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై దాడులు నిర్వహించి ఇప్పటి వరకు 14 వందల వాహనాలు సీజ్ చేసి 4 వేల మంది ని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారివద్ద నుంచి రూ.6 కోట్ల విలువైన గుట్కా స్వాధీనం చేసి 570 మంది పై చర్యలు తీసుకున్నామన్నారు. 8 వేల కేజీలను గంజాయిని సజ్ చేసి, 250 కేసులు పెట్టినట్లు చెప్పారు. అలాగే 570 గంజాయి వాడకం దార్లును గుర్తించి మార్పు కోసం కౌన్సిలింగ్ చేసి వారిలో పరివర్తనను తీసుకువచ్చినట్ల తెలిపారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న కొండపల్లి ఎన్నికలు ప్రశాంతవాతావరణం లో జరిగేలా అన్ని చర్యలు చెపట్టినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు