Monday, November 25, 2024

నిరాడంబరంగా సురుటుపల్లి ఆలయబోర్డు ప్రమాణ స్వీకారం

సత్యవేడు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటు పల్లిలోని సుప్రసిద్ద శ్రీ పళ్లి కొండేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి గురువారం ఎటువంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసింది. ఆ ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం, పరిపాలన  విషయాల్లో గత కొంతకాలంగా పలురకాల వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. మరో వైపు అధికార పార్టీకి చెందిన పలువురు ఆ ఛైర్మన్ పదవికి పోటీ పడుతుండటంతో నియామకం విషయంలో ఉత్కంట కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు మహాశివరాత్రి ఉత్సవాలు రానున్న నేపద్యంలో అన్నీ వివాదాలకు తెరదించుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ బుధవారం దాసుకుప్పం గ్రామానికి చెందిన ఏవీఎం ముని చంద్రశేఖర్ రెడ్డి (బాలాజీ రెడ్డి) ఛైర్మన్ గా నూతన ట్రస్ట్ బోర్డును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆ ఉత్తర్వుల మేరకు బోర్డు సభ్యులుగా మునివేలు (సత్యవేడు), మంజుల (మదనపాల్యం), అజయ్ కుమార్ (బుచ్చినాయుడు కండ్రిక మండలం కణవలంబేడు), కవిత (వరదయ్యపాలెం మండలం కడూరు), సురేష్ (నాగలాపురం), చిత్ర(నాగలాపురం మండలం సురుటుపల్లి), సత్య (సురుటుపల్లి) ఆనందుడు (నాగలాపురం మండలం ఎస్ఎస్ పురం), ఎక్స్ఆఫీసియో సభ్యులుగా ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేసన్ నియమతులయ్యారు. బాలాజీ రెడ్డి నియామకంలో ముఖ్యంగా రాష్ట్ర మంత్రి జిల్లా రాజకీయాలను శాసిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు కీలకమైంది. ఇదిలా ఉండగా బాలాజీ రెడ్డి నేతృత్వం లోని ట్రస్ట్ బోర్డు గురువారం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా, నిరాడంబరంగా ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసింది. సాధారణంగా అయితే ఆ ఆలయ ధర్మకర్తల మండలి పదవి ప్రమాణ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు భిన్నంగా ఈ కార్యక్రమంలో కూడా అతి కొద్ది మంది మాత్రమే పాల్గొనడం గమనార్హం. ఈ విషయం తెలిసి ఆలయానికి తరలివచ్చిన వారు ప్రమాణస్వీకారం చేసిన బోర్డుకు అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement